
పేదల అభివృద్ధే సహకార బ్యాంక్ లక్ష్యం
బాపట్ల: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ తన సేవలను కొనసాగిస్తూ ఖాతాదారుల మన్ననలు పొందుతోందని బ్యాంక్ డైరెక్టర్ జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. బాపట్ల బ్రాంచ్ సభ్యుల మహాసభ శుక్రవారం బ్రాంచి ఆవరణలో జరిగింది. బ్యాంక్ వైస్ చైర్మన్ ముదివర్తి రాఘవరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సభ్యులకు సంక్షేమ పథకాలను బ్యాంకు అమలు చేస్తోందన్నారు. దేశ పురోభివృద్ధిలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. నిబంధనల పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి సామాన్యులకు రుణాలు అందిస్తూ లాభాపేక్ష లేకుండా సభ్యులకే లాభాలు పంచుకున్న ఘనత విశాఖ బ్యాంకుకే దక్కుతుందని చెప్పారు. బ్యాంక్ డైరెక్టర్ నన్నపనేని అంజయ్య, జోనల్ మేనేజర్ ఎఎస్‌ఆర్ మూర్తి, బ్రాంచ్ మేనేజర్ అర్జునరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.