
కలెక్టర్ సేవలు అభినందనీయం
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
బాపట్ల: రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బాపట్లలో చేపడుతున్న సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ కలెక్టర్ జె వెంకట మురళికి అవార్డు, పతకాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు. గురువారం ఏపీ రాజభవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి అవార్డు అందుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో బాపట్ల జిల్లాలో 1,200 మందిని రెడ్‌క్రాస్ సభ్యులుగా చేర్పించారు. జిల్లాకు రూ.12 లక్షలు సొమ్మును సభ్యత్వ నమోదుతో రెడ్‌క్రాస్ సంస్థకు ఆర్థిక వనరులను పెంచారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.ఇటీవల కృష్ణానది వరద విపత్తు సమయంలోనూ బాపట్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని జరగకుండా ముందస్తు ప్రణాళికతో జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఆ సమయంలో ప్రజలకు విశేషంగా సేవలందించినందుకు జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు.
పాక్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే సత్తా భారత్‌కు ఉంది
కారంచేడు: పాకిస్తాన్‌ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని మట్టు పెట్టగలిగే సత్తా భారత్‌కు ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం కారంచేడు గ్రామంలోని ఆమె స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక ప్రజలపై చేసిన దాడులను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్‌ను ఒంటరిని చేశాయన్నారు.
తీరంలో ఇద్దరు
యువతులు గల్లంతు
కాపాడిన పోలీసులు
బాపట్లటౌన్: స్నానాలు చేస్తూ ఇద్దరు యువతులు సముద్రంలో మునిగిపోయిన ఘటన గురువారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గేశ్‌దేవి, నీషాలు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ బైపాస్, హనుమాన్ టెంపుల్ సమీపంలోని బుల్లెట్ స్పిన్నింగ్ మిల్లులో నివాసముంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యలంక బీచ్‌కి వచ్చారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఆలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువురిని కాపాడారు. ఇద్దరు ప్రాణాలు కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ నాగశివారెడ్డి, ఏఎస్‌ఐ అమరేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు, హోంగార్డు నారాయణలను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.
తహసీల్దారు
కార్యాలయం మూత
అమర్తలూరు(వేమూరు): అమర్తలూరు తహసీల్దార్ కార్యాలయం గురువారం మూత పడింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పీఏ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రెవెన్యూ సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేశారు. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కలెక్టర్ సేవలు అభినందనీయం

కలెక్టర్ సేవలు అభినందనీయం