
ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
బాపట్ల టౌన్: నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పత్రికా సంస్థల ఎడిటర్ ఇళ్లపై ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్యని బాపట్ల వర్కింగ్ జర్నలిస్ట్‌ల యూనియన్ సహాయ కార్యదర్శి కాగిత ప్రశాంత్‌రాజు తెలిపారు. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి అపార్టుమెంట్‌లోకి పోలీసులు వెళ్లి తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించిన తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం బాపట్లలోని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సీతారత్నానికి వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్‌రాజు మాట్లాడుతూ కనీసం సెర్చ్ వారెంట్ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని తెలిపారు. పత్రికా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్. ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి, అక్ర మాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికా రంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాపట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు వేజెండ్ల శ్రీనివాసరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, రాఘవేంద్రరావు, పరిశా వెంకట్, సృజన్‌పాల్, శీలం సాగర్, మార్పు ఆనంద్, అడే రవిజేత, జె. రవిరాజేష్ పాల్గొన్నారు.