గర్భిణి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

గర్భిణి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు

May 8 2025 8:03 AM | Updated on May 8 2025 2:04 PM

బల్లికురవ: మండలంలోని కొప్పరపాడు గ్రామానికి చెందిన గర్భిణి సురభి సారమ్మను హతమార్చిన కేసులో నిందితురాలైన ఆడపడుచు లింగమ్మకి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఒంగోలు అడిషనల్‌ డిస్ట్రిక్‌ జడ్జి డి. రాజావెంకటాద్రి ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించినట్లు బల్లికురవ ఎస్సై నాగరాజు తెలిపారు. సురభి సారమ్మకు చార్లెస్‌తో 2014లో వివాహం అయింది. మద్యానికి బానిసైన చార్లెస్‌ తరచూ భార్యను వేధించేవాడు. అత్తింటి వారు కూడా హింసించేవారు. 2015 సెప్టెంబర్‌ 13న భర్తతోపాటు అత్త, మామ, ఆడపడుచు ఏసమ్మ, పున్నయ్య, లింగమ్మలు కలిసి సారమ్మను కర్రతో కొట్టి, కిరోసిన్‌పోసి నిప్పు అంటించారు. తీవ్రగాయాలైన సారమ్మ ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేసిన అనంతరం 18వ తేదీ చనిపోయింది. నిందితుల్లో అత్తా, మామ చనిపోవటంతోపాటు భర్త కోర్టు నుంచి బెయిల్‌పై వచ్చి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆడపడుచు లింగమ్మకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధించారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

రేపల్లె: విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఇసుకపల్లిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు... 17వ వార్డుకు చెందిన మోపిదేవి సుమతి (41) బుధవారం ఉదయం తన ఇంటి పెరటిలోని నిమ్మ చెట్టుకు నీళ్లు పడుతోంది. పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి ఆనుకోవటంతో షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుమతి భర్త నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎస్సీ మహిళలకు ఉచితంగా కుట్టు, కంప్యూటర్‌ శిక్షణ

నరసరావుపేట ఈస్ట్‌: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఎస్సీ మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు, కంప్యూటర్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ), ఎస్సీ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్టు వివరించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని ఎన్‌ఏసీ శిక్షణా కేంద్రంలో ఈ తరగతులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ సామాజిక మహిళలు తమ ఆధార్‌, కుల ధ్రువీకరణ, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, ఆధార్‌ లింక్‌ మొబైల్‌ ఫోన్‌తో ఎన్‌ఏసీ కేంద్రంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9394102075, 9985496190 నెంబర్లులో సంప్రదించాలని తెలిపారు.

రెంటాలలో 22 గేదెల అపహరణ

రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో 22 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామంలోని కటికల సంసోన్‌, పేరుపోగు ఇస్రాయేల్‌, కటికల యేసయ్య, చిలక మరియమ్మలకు చెందిన 22 గేదెలు ఏప్రిల్‌ 26 వ తేదీన మేత కోసం పొలంవెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల గ్రామాలలో గాలించినా కనిపించపోవడంతో ఎవరైనా దొంగిలించి ఉంటారని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన గేదెల విలువ సుమారు రూ. 3.90 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.ఽ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement