
నేటి నుంచి మొగదారమ్మ తిరునాళ్ల
నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాంపట్నంలో వేంచేసియున్న మొగదారమ్మ వారి సిడిమాను, తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల ఉత్సవాలలో భాగంగా 8వ తేదీన అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకుతో పూతవేయటం, ప్రత్యేక పూజలు, సత్యహరిచంద్ర పౌరాణిక నాటక ప్రదర్శన జరగనున్నాయి. 9వ తేదీన అమ్మవారికి జలక్రీడలు, పసుపు బండ్ల ఊరేగింపు, ప్రత్యేక పూజలు, స్వాతి చినుకులు నాటక ప్రదర్శన ఉంటాయి. 10వ తేదీన శనివారం అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్లటం, అక్కడి నుంచి ఆలయానికి ఊరేగింపు, ప్రత్యేక పూజలు, న్యూ ఇండియన్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో అగ్నిపుత్రులు పౌరాణిక నాటక ప్రదర్శన ఉంటాయి. 11వ తేదీన అమ్మవారి గ్రామోత్సవం, మాధవ్ ఈవెంట్స్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో డాన్స్ కార్యక్రమం, 12 వ తేదీన అమ్మవారికి మొక్కుబడులు, ప్రత్యేక పూజలతో పాటు అన్నసంతర్పణ, మెగా డాన్స్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.