పెసర, శనగ, కంది, మినుము కొంటామన్న ప్రభుత్వం
మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో 62 కేంద్రాలు ఏర్పాటు
48 కేంద్రాల్లో ఒక్క గింజ కూడా కొనని వైనం
జిల్లాలో సగటున లక్ష టన్నుల దిగుబడి అంచనా
ఇప్పటివరకూ మార్క్‌ఫెడ్ కొన్నది 958 టన్నులే
ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మద్దతు ధరకు పంటలు కొనని సర్కార్
పలు రకాల ఆంక్షలతో రైతులకు తప్పని వేధింపులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో రైతులు సాగు చేసిన శనగ, మినుము, పెసర, కంది, మొక్కజొన్న వంటి పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు అంటూ జిల్లా వ్యాప్తంగా 50 రోజుల క్రితం 62 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామమాత్రంగా కూడా కొనుగోళ్లు జరగకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పంటలవారీగా దుస్థితి ఇదీ..
● ప్రధానంగా పెసలు 8 వేల టన్నుల దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మద్దతు ధర క్వింటాకు రూ.8,862గా ప్రభుత్వం నిర్ణయించింది. బయట మార్కెట్‌లో రూ.7 వేలలోపు వస్తోంది. మార్క్‌ఫెడ్ సేకరణ లక్ష్యం 3,500 టన్నులు. కానీ ఇప్పటివరకు 869 టన్నులు మాత్రమే సేకరించింది. తేమ శాతం, నాణ్యత, పరిమాణం అంటూ రకరకాల కారణాలు చూపి పంటలను కొనుగోలు చేయడం లేదు.
● జిల్లాలో అద్దంకి, పర్చూరు ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు కంది పంట సాగు చేశారు. 190 టన్నుల దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మద్దతు ధర క్వింటాకు రూ.7,550గా నిర్ణయించారు. బయట మార్కెట్‌లో రూ.6 వేలకు మించి లేదు. ప్రభుత్వం 12 శాతంలోపు తేమ, పరిమాణం, నాణ్యత, క్వింటాకు 4 కిలోల తరుగు పేరిట ఆంక్షలు అమలు చేసి పట్టుమని 69 టన్నులకు మించి కూడా కొనలేదు.
● జిల్లాలో ఒక మోస్తరుగా రైతులు మినుము సాగు చేయగా, సుమారు 35 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. క్వింటాకు మద్దతు ధర రూ.7,400గా నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 19 టన్నులు సేకరిం చింది.
● జిల్లాలో 45 వేల టన్నుల వరకు శనగ దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మార్క్‌ఫెడ్ లక్ష్యం 5 వేల టన్నులుగా ప్రభుత్వం నిర్దేశించింది. క్వింటా ధర రూ.5,650గా నిర్ణయించారు. కానీ ఒక్క టన్ను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు.
● మొక్కజొన్న 23,500 హెక్టార్లలో సాగు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.3,371 గా నిర్ణయించింది. ఇప్పటివరకు పంట కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. మొక్కజొన్న కొనేవారు లేక రైతులు పంటను కల్లాల్లోనే వదిలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మరీ ఇంత తక్కువా?
వాస్తవానికి మినుము 35,000 , శనగ 45,000 , మొక్కజొన్న 23,500, పెసర 8,000, కంది 190 టన్నుల చొప్పున మొత్తం 1,11,690 టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా కట్టింది. మార్క్‌ఫెడ్ నిర్దేశిత లక్ష్యాల మేరకు పెసర 3,500, శనగ 5000, కంది 190 టన్నులుగా నిర్దేశించారు. ఆ ప్రకారం చూసినా 8,690 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ 958 టన్నులు మాత్రమే మార్క్‌ఫెడ్ కొని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 48 కేంద్రాల నుంచి ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
మద్దతు ధరకు కందులు కొనలేదు
నేను 1.50 ఎకరాల్లో కంది సాగు చేశా. నాలుగు క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.7,750 అని చెప్పినా అధికారులు నానా రకాల ఆంక్షలు పెట్టి కొనలేదు. 12 లోపు తేమ శాతం పేర్కొన్నారు. క్వింటాకు 4 కిలోల తరుగు తీసుకుంటామన్నారు. జల్లెడ పెట్టి పెద్ద సైజు ఉంటేనే కొంటామని చెప్పారు. నాణ్యత విషయంలోనూ ఆంక్షలు పెట్టి సక్రమంగా కొనుగోలు చేయలేదు. దీంతో కందులు ఇంట్లోనే ఉంచుకున్నా. కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయించారు.
– రాంబాబు, రైతు, తిమ్మాయిపాలెం, అద్దంకి మండలం.
ధర తక్కువైనా దళారులకే విక్రయిస్తున్న అన్నదాతలు
మద్దతు ధరకు పంట కొంటామన్న కూటమి సర్కార్ మాట తప్పింది. పేరుకు జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించినా.. పలు రకాల ఆంక్షలు విధించి మొక్కుబడిగా కూడా కొనుగోలు చేయలేదు. రైతులు తక్కువ ధరకే దళారులకు పంటలు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోగా... చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా అన్నదాతలను వంచిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్దతు మిథ్య.. మార్క్‌ఫెడ్ మాయ!