బాపట్లటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 31 వరకు జరగనున్న పరీక్షలకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 16,799 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 16,361 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 438 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. వీరికోసం 103 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. హాల్ టికెట్‌లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థులకు అందజేశాయి.
ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమ్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని వివరించారు. పావుగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వచ్చేలా విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించామని, ఈ ప్రాంతంలో జిరాక్స్, నెట్ సెంటర్లు తెరవరాదని వివరించారు. పరీక్షల నిర్వహణకు 103 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 103 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది సీ కేటగిరి కస్టోడియన్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, పదిమంది రూట్ ఆఫీసర్లను నియమించినట్టు వెల్లడించారు.
నేటి నుంచి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
పకడ్బందీ బందోబస్తు : ఎస్పీ
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు చేపట్టినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని వివరించారు. ఒక్కో కేంద్రం వద్ద ఇద్దరు సిబ్బంది చొప్పున 206 మందిని నియమించామని పేర్కొన్నారు. వీరితోపాటు ప్రతి కేంద్రంలో ఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షణకు ఉంటారని వెల్లడించారు.