
జీవాలకు విధిగా చిటుకు వ్యాధి నివారణ టీకా
జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎం.హనుమంతరావు
చీరాల టౌన్: పశు పోషకులు విధిగా జీవాలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ మద్దు హనుమంతరావు సూచించారు. మంగళవారం మండలంలోని బోయినవారిపాలెం గ్రామంలో పశు వైద్యురాలు డాక్టర్ పావని ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు చిటుకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన హనుమంతరావు మాట్లాడుతూ తొలకరి వర్షాలకు గ్రామాల్లోని గొర్రెలు, మేకలు లేత పచ్చని గడ్డి తినడంతో క్లాస్టీడియా బ్యాక్టీరియా కడుపులోకి చేరి అనారోగ్యానికి గురై మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు. చిటుకు వ్యాధి రాకుండా గొర్రెలకు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని చెప్పారు. రైతులు, పశు పోషకులు తమ జీవాలకు టీకాలు వేయించాలన్నారు. అనంతరం ఈపురుపాలెం పశు వైద్యశాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. పశు వైద్యురాలు పావనికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఏడీ డాక్టర్ చిట్టిబాబు, పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.