
ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులు, హాజరైన ప్రతినిధులు
అద్దంకి రూరల్: కవిగా, అవధానిగా అనువాదకుడిగా కాకుండా అనేక రంగాల్లో విశేష ప్రతిభ మూర్తి అనంత పద్మనాభరావు రచయిత పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. స్థానిక రామసుశీల నిలయంలో పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల సాహిత్య పురస్కార సభ ఆదివారం నిర్వహించారు. సభకు వారణాసి రఘురామశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పురస్కార గ్రహీత అనంత పద్మనాభరావు కథా రచయితగా, పరిశోధకుడుగా, చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా, రేడియో, దూరదర్శన్‌లలో సృజనాత్మక కార్యక్రమాల రూపశిల్పిగా, ఐఏఎస్ విద్యార్థులకు శిక్షకుడి అందించిన సేవలను కొనియాడారు. ప్రముఖ కవి డీవీఎం సత్యనారాయణ మాట్లాడుతూ పద్మనాభరావు అధికార సేవలను, విశేషమైన సాహిత్య సేవలను సభకు పరిచయం చేశారు. తన 12 ఏటనే అవధానాన్ని ప్రారంభించి 50కు పైగా అవధానాలు చేసి రాబోయేతరాలను అవధాన విశిష్టతను తెలియపరిచారని పేర్కొన్నారు. పలువురు కవులు, సాహిత్య వేత్తలు పద్మనాభరావు ప్రతిభను కొనియాడారు. అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారాన్ని అనంత పద్మనాభరావుకు అందజేశారు. పురస్కార నగదుగా రూ.10 వేలు, పట్టువస్త్రాలు అందించారు. కార్యక్రమంలో సాహితీ మిత్రమండలి అధ్యక్ష, కార్యదర్శులు లక్కరాజు చంద్రశేఖర్, మురళీ సుధాకరరావు, యు.దేవపాలన, ఆర్‌వీ రాఘవరావు, చప్పిడి వీరయ్య, వామరాజు వెంకటేశ్వర్లు, ఇలపావులూరి శేషతల్పశాయి పాల్గొన్నారు.
పల్నాడు ఆరోగ్యమిత్ర ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఏపీ ఆరోగ్యమిత్ర అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సరికొండ సాయిబాబారాజు, కొమ్ము శివనాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఏపీ ఆరోగ్యమిత్ర దళిత, గిరిజన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి సమక్షంలో గుంటూరురోడ్డులోని కొండవీడు ఈఎన్‌టీ హాస్పిటల్ సముదాయంలో నిర్వహించిన సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకాని అప్పారావు వ్యవహరించారు. ఉపాధ్యక్షులుగా కర్పూరపు సుధాకర్, కార్యదర్శిగా సింగంశెట్టి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా ఏ.రమేష్‌నాయక్, కోశాధికారిగా జుజ్జూరు లక్ష్మీ రోజారమణి, ఉప కోశాధికారిగా ఎ.అశోక్, యూనియన్ గౌరవ సలహాదారునిగా పూజారి పూర్ణచంద్రరావు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొమ్మలవరపు శ్రీనివాసరావు, గౌరవ సలహాదారుడు పూజారి పూర్ణచంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఎం.చంద్రయ్య, వీరాంజనేయులు, గోపి, బాజీ బాబు, రామాంజనేయులను ఎన్నుకున్నారు. కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుందని ఎన్నికల అధికారి అప్పారావు తెలిపారు.

పద్మనాభరావుకు పురస్కారాన్ని అందజేస్తున్న శ్రీరామచంద్రమూర్తి తదితరులు