
నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి
నరసరావుపేట: భగవాన్ విరాట్ విశ్వకర్మ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారని, జయంతిని భారతీయ శ్రామిక దినోత్సవంగా కూడా భావిస్తారన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ డి.రామచంద్రరాజు, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పదోన్నతి పొందిన
న్యాయమూర్తులకు సన్మానం
గుంటూరు లీగల్: సీనియర్ సివిల్ జడ్జిలుగా పని చేస్తూ ఇటీవల పదోన్నతి పొందిన గుంటూరు జిల్లాలోని ముగ్గురు న్యాయమూర్తుల్ని ఘనంగా సన్మానించారు. తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వై.బెన్నయ్య నాయుడు పదోన్నతిపై రాజమహేంద్రవరంలోని 8వ అడిషనల్ జిల్లా కోర్టుకు, గుంటూరు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.చంద్రమౌళీశ్వరి పదోన్నతిపై పెద్దాపురంలోని ఏడో అడిషనల్ జిల్లా కోర్టుకు, బాపట్ల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి.సాధుబాబు పదోన్నతిపై అనంతపురంలోని 8వ అడిషనల్ జిల్లా కోర్టుకు జిల్లా జడ్జిలుగా నియమితులైయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ఆదివారం జరిగిన సమావేశం అనంతరం న్యాయమూర్తుల్ని సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో పాటు విఘ్నేశ్వరుని చిత్రపటాన్ని అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి, పాల్గొన్నారు.

కార్యాలయంలో విశ్వకర్మ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ రవిశంకర్‌రెడ్డి