మల్కాపురం(విశాఖ జిల్లా): సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలివీ.. ఇంకొల్లు మండలం పావులూరుకు చెందిన వంకదారి వీరాంజనేయులు(34) 2009లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. 2021లో హెచ్‌పీసీఎల్(విశాఖ రిఫైనరీ) సంస్థకు బదిలీపై వచ్చి.. అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. మల్కాపురం సమీపంలోని సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్‌లో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడంతో నిద్రించడానికి వెళ్లాడని భార్య భావించింది. సాయంత్రం టీ తాగేందుకు అతన్ని నిద్రలేపేందుకు గది తలుపు కొట్టింది. ఎంతకూ స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి పక్క క్వార్టర్స్‌లో ఉన్న వారిని పిలిచింది. వారు కిటికీ తెరిచి చూడగా ఫ్యాన్‌కు వీరాంజనేయులు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని మల్కాపురం పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఆర్థిక ఇబ్బందులే కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.