పచ్చపండుగకు.. లక్షల్లో దండగ ! | - | Sakshi
Sakshi News home page

పచ్చపండుగకు.. లక్షల్లో దండగ !

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

ఖర్చు రూ. 23 లక్షలే

మదనపల్లె టౌన్‌ బ్యాంకులో

ఆర్‌బీఐ రూల్స్‌కు పాతర

ప్రజల బ్యాంకును ‘టీడీపీ

లిమిటెడ్‌’గా మార్చేసిన చైర్మన్‌

సొమ్ము ‘బ్యాంకు’ది..

సోకు ‘నాదెండ్ల’ది!

వందేళ్ల కార్యక్రమంలో వివక్ష

ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డిల విస్మరణ

సాక్షి,మదనపల్లె: ‘ది మదనపల్లె కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాక్‌ లిమిటెడ్‌’ వందేళ్ల ఉత్సవం పేరిట రూ.లక్షల నిధులను నీళ్ళలా ఖర్చు చేసి దుర్వినియోగం చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కఠిన పర్యవేక్షణలో స్వతంత్రంగా నడవాల్సిన ‘ది మదనపల్లె కో–ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’లో పచ్చ నేతల రాజకీయ కక్షసాధింపు చర్యలు తారస్థాయికి చేరాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రజల బ్యాంకు పాలకవర్గ చైర్మన్‌ నాదెండ్ల విద్యాసాగర్‌ అచ్చమైన టీడీపీ నాయకుడు కావడంతో, బ్యాంకును కాస్తా ‘టీడీపీ లిమిటెడ్‌ బ్యాంకు’గా మార్చేశారు. వందేళ్ల ఉత్సవాల పేరిట 17 నెలలు ఆలస్యంగా, గతేడాది డిసెంబర్‌ 3న నిర్వహించిన సభకు సంబంధించి ఇచ్చిన అధికారిక పత్రికా ప్రకటనలలోనూ వైఎస్సార్‌ సీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులపై తీవ్ర వివక్ష చూపించారు.

ఎంపీ మిథున్‌రెడ్డి,

సీనియర్‌ నేత పెద్దిరెడ్డిలపై నిర్లక్ష్యం!

ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న పరిధిలోని వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులపై పాలకవర్గం ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతోనే నిర్లక్ష్యం వహించింది. ఈ బ్యాంకు రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్‌ ఎంపీగా గెలిచిన పీవీ.మిథున్‌రెడ్డి అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధి. అలాంటిది, ఈ ఉత్సవ అధికారిక ప్రకటనల్లో ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారు. అలాగే పుంగనూరులో ఈ బ్యాంకు బ్రాంచి కార్యాలయం విజయవంతంగా నడుస్తోంది. అక్కడ వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం అక్కడ తమ బ్యాంకు బ్రాంచి ఉందన్న కనీస ఆలోచన కూడా లేకుండా.. పత్రికా యా డ్స్‌లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా చేశారు. కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి కూడా పాలకవర్గం మొండిచేయే చూపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కనీసం ప్రజాప్రతినిధులు కూడా కాని పచ్చ నాయకుల ఫొటోలను మాత్రం లక్షల రూపాయల బ్యాంకు సొమ్ముతో ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ప్రముఖంగా ప్రచురించి పెద్దపీట వేశారు.

బ్యాంకు టీడీపీకి మాత్రమే

సంబంధించినదా?

ఈ పగటిదోపిడీ మరియు ఏకపక్ష వైఖరి చూసి బ్యాంకు ఖాతాదారులు, సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఈ బ్యాంకు కేవలం టీడీపీకి మాత్రమే సంబంధించినదా? టీడీపీ నేతలు ఫొటోలు వేసుకొని ప్రచారం చేసుకునేందుకు సామాన్యుల, ఖాతాదారుల సొమ్మును ఎలా దుబారా చేస్తారు?’ అని సభ్యులు నిలదీస్తున్నారు. ఒకవైపు సావనీర్‌ నిండా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల భజన లేఖలతో నింపేసి, మరోవైపు చైర్మన్‌ నాదెండ్ల విద్యాసాగర్‌కు చెందిన సొంత కల్యాణమండపాన్ని వేదికగా చేసుకుని నిధులు మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల సొమ్మును కూటమి నేతల విందులు, ప్రచారాలకు తగలేసిన ఈ ‘పచ్చ’ దోపిడీపై తక్షణమే ఆర్‌బీఐ మరియు సహకార శాఖ ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలని పట్టణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

శత వసంతాల ఉత్సవానికి చేసిన మొ త్తం ఖర్చు రూ.23 లక్షలు మాత్రమే. ఈ ఉత్సవానికి రూ. 43 లక్షలు ఖర్చు చేశారన్న ప్రచారంలో నిజం లేదు. ఖర్చులు బాగా తగ్గించుకున్నాం. సావనీర్‌ ముద్రించడానికి వివిధ వర్గాల నుంచి సేకరించిన ప్రకటనల సొమ్మును మాత్రమే వినియోగించాం.

– టౌన్‌బ్యాంకు సీఈవో పీవీ ప్రసాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement