డబ్బుంటే గంటలో.. లేకుంటే 48 గంటల నిరీక్షణ
స్కానింగ్.. స్కామింగ్!
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కి ‘మాఫియా’గా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణీ మహిళల ఆరోగ్య సమస్యలను, ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ స్కానింగ్ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు.
మెషిన్లు ఉన్నా నడిపే నాథుడే లేడు..
జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి మొత్తం 25 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అయితే, గర్భిణీ మహిళలకు అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం మాత్రం కేవలం 4 ఆసుపత్రుల్లో మాత్రమే అరకొరగా అందుబాటులో ఉంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఇద్దరు రేడియాలజిస్టులకు గానూ ఒకరే ఉండగా, ఆమె కూడా సెలవుపై వెళ్లడంతో స్కానింగ్ విభాగం పూర్తిగా మూతపడింది. రాయచోటి ఏరియా ఆసుపత్రిలో స్కానింగ్ మెషిన్ ఉన్నప్పటికీ అది పని చేయడం లేదు. పీలేరు ఆసుపత్రిలో డాక్టర్లు, సాంకేతిక సిబ్బంది ఎవరూ లేరు. రాజంపేట ఏరియా ఆసుపత్రిలో ఒక స్కానింగ్ మెషిన్, ఒక డాక్టర్ ఉన్నా.. టెక్నీషియన్ వారానికి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. జిల్లా మొత్తానికి 8 మంది రేడియాలజిస్టులు అవసరం కాగా.. ప్రస్తుతం ఉన్నది ఒక్కరే.
ప్రభుత్వ ధర రూ.500.. ప్రైవేట్ బాదుడు రూ.5,000: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో 95 శాతం మంది గర్భిణులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌కు రూ. 500 – రూ. 800, టిఫా స్కా న్‌కు రూ. 1,000 – రూ. 1,500, డాప్లర్ స్కాన్‌కు రూ. 1,500 – రూ. 2,000 మాత్రమే తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు సాధారణ స్కాన్‌లకే రూ. 1,500 నుంచి రూ. 5,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో గర్భధారణ కాలంలో 3 నుంచి 4 సార్లు స్కానింగ్ తీయించాలి. ఈ మేరకు కేవలం స్కానింగ్‌ల కోసమే పేద కుటుంబాలు రూ. 8,000 వరకు అప్పులు చేసి ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
రూ.15,000 ఇస్తే చాలు లింగనిర్ధారణ
ప్రభుత్వ నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని మదనపల్లె, రాయచోటి పరిసర ప్రాంతాలలో ప్రైవేట్ సెంటర్లు ‘ప్యాకేజీ’ల పేరిట అక్రమ దందాకు తెరలేపాయి. రూ.15,000 ల ప్యాకేజీ తీసుకుని పుట్ట బోయే బిడ్డ లింగం (ఆడో, మగో) చెబుతున్నారనే సమాచారం ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఈ అక్రమ లింగ నిర్ధారణ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది.
పడిపోతున్న ఆడపిల్లల నిష్పత్తి
ఈ అక్రమ లింగ నిర్ధారణల కారణంగా జిల్లాలో భ్రూణహత్యలు పెరిగిపోయి, బాలికల సంఖ్య ప్రమాదకరంగా పడిపోతోంది. జిల్లాలో 0–6 ఏళ్ల పిల్లల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి 1,000 మంది మగపిల్లలకు 873 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు అయిన 934 కంటే చాలా తక్కువగా ఉండటం నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సీసీటీవీలు లేవు.. రికార్డింగ్‌లు లేవు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ రూమ్‌లో ఆడియో, వీడియో రికార్డింగ్‌తో కూడిన సీసీటీవీ తప్పనిసరిగా ఉండాలి. రెండేళ్ల పాటు రికార్డు భద్రపరచాలి. ప్రతి గర్భిణీకి స్కానింగ్ ముందు ఫారం–ఎఫ్ ను నింపి, ఆధార్, భర్త సంతకం తీసుకోవాలి. ఆన్‌లైన్ ఎంట్రీ ద్వారా ప్రతి స్కాన్ వివరాలు 24 గంటల్లో పీసీపీఎన్‌డీటీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు. అతిక్రమిస్తే 3 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా‘ అనే బోర్డు తెలుగు, ఇంగ్లీషులో పెట్టాలి. కానీ జిల్లాలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు 27 పైనే ఉన్నాయి. పగటిపూట తనిఖీలు ఉంటాయనే భయంతో, రాత్రి వేళల్లో రహస్య ప్రాంతాలలో ఇళ్ల వద్దకే పోర్టబుల్ మెషిన్లను తీసుకువెళ్లి దొంగచాటుగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మదనపల్లెలోని ప్రైవేట్ సెంటర్లలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకోవడానికి గర్భిణీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇక్కడ డబ్బు, పలుకుబడి ఉన్నవారికి గంటలోనే స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. అదే మారుమూల పల్లెల నుంచి వ్యయప్రయాసలకోర్చి మినిమం ఫీజు కట్టి వచ్చే నిరుపేద మహిళలకు మాత్రం అవమానం ఎదురవుతోంది. ఒక రోజు లేదా రెండు రోజులు ముందే అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటికీ, వారిని 24 గంటల నుంచి 48 గంటల పాటు రోడ్డుపై పడిగాపులు కాయిస్తున్నారు.
జిల్లాలో కాసుల కోసంచిన్నారులు బలి
రెచ్చిపోతున్న స్కానింగ్ మాఫియా
అధికారుల అండతోనే అక్రమ దందా?
8 మంది రేడియాలజిస్టులకు ఉన్నది ఒక్కరే!
95 శాతం మంది గర్భిణులకుప్రైవేటే దిక్కు
రాష్ట్ర సగటు కంటే పడిపోయినబాలికల లింగ నిష్పత్తి (873 మాత్రమే)
ప్రభుత్వానికి నివేదికలు పంపాం
జిల్లాలో మొత్తం 59 స్కానింగ్ సెంటర్లు ఉండగా, ప్రస్తుతం 52 సెంటర్లకు మాత్రమే అను మతులున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 2025– 26 సంవత్సరంలో 18 దాడులు నిర్వహించి, 7 కేసు లు నమోదు చేశాం. 3 స్కానింగ్ సెంటర్లను పూర్తిగా సీజ్ చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు లేకపోవడం పెద్ద సమస్యగా మారిన మాట వాస్తవమే, దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపాం. లింగ నిర్ధారణను అరికట్టడానికి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. – డాక్టర్ లక్ష్మీనరసయ్య,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి


