● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్‌’ వ్యూహాలు! | - | Sakshi
Sakshi News home page

● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్‌’ వ్యూహాలు!

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

● పోలీసుల కళ్లుగప్పేందుకు ‘హైటెక్‌’ వ్యూహాలు!

రాయలసీమలోహైటెక్‌ పశువుల దందా

పోలీసుల కళ్లుగప్పి కబేళాలకుమూగజీవాల అక్రమ రవాణా!

సాక్షి, అన్నమయ్య: కూటమి సర్కార్‌లో మూగజీవుల వేదన అరణ్యరోదనగా మారింది. ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల తినడానికి మేత, తాగడానికి నీరు లేక రైతులు తమ పశువులను సాకలేక నిస్సహాయ స్థితికి చేరుకుంటే, మరోవైపు ఈ కష్టాలను అక్రమ వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్ల నుంచి తక్కువ ధరలకే పశువులను కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కసాయి ఖానాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు.

అక్రమ రవాణా మార్గాలు

రాయలసీమలోని ప్రధాన కేంద్రాల నుండి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ రెండు ప్రధాన మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఒకటి బెంగళూరు మార్గం..వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కడప ప్రాంతాల నుండి పశువుల ను సేకరిస్తున్నారు. అక్కడి నుండి వాటిని రాయచోటి, మదనపల్లె మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలిస్తున్నారు. రెండో రూట్‌లో హిందూపురం, అనంతపురం, కదిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా భారీ కంటైనర్లలో మూగజీవాలను తమిళనాడు, కేరళ సరిహద్దులు దాటిస్తున్నారు.

కంటైనర్లలో కుక్కి... ఊపిరాడక పశువుల మృతి!

అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదన మార్గంగా మార్చుకుని, పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్‌లో సామర్థ్యానికి మించి దాదాపు 70 నుండి 80 కి పైగా ఆవులు, ఎద్దులు, గేదెలను ఎలాబడితే అలా కుక్కుతున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకయాతన చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పెద్దమండ్యం మీదుగా మంగళవారం ఉదయం వెళ్తున్న 10 భారీ కంటైనర్లను తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది. ఆయా వాహనాలలో మొత్తం 510 పైగా మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండగా, గాలి కూడా ఆడని రీతిలో ఒకదానిపై ఒకటి కుక్కడం వల్ల ఊపిరాడక పలు పశువులు కంటైనర్లలోనే మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

చెక్‌ పోస్టుల వద్ద ‘అమ్యామ్యాలు’..

ఈ అక్రమ రవాణా అంతా అధికారులకు తెలిసినా ఎవరికీ తెలియనట్లుగా సాగిపోతుండటం గమనార్హం. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, సంబంధిత అధికారులు అక్రమార్కుల వద్ద ’చేయి తడు పుకుంటూ’ వాహనాలను వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నోరు లేని మూగజీవాలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నా పరిరక్షించా ల్సిన ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని జీవకారుణ్యమూర్తులు మండిపడుతున్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టి ఈ మాఫియా ఆటకట్టించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కంటైనర్‌లో కుక్కి ఆవులను తరలిస్తున్న దృశ్యం

అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఈ అక్రమ రవాణా ముఠాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. పశువుల కంటైనర్‌ కంటే ఒక కిలోమీటరు ముందే ఒక ‘పైలట్‌ వాహనం’ (కార్‌ లేదా బైక్‌) రోడ్డుపై వెళ్తుంటుంది. మార్గమధ్యంలో పోలీసులు లేదా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే వెనుక వస్తున్న కంటైనర్ల డ్రైవర్లను అప్రమత్తం చేసి దారి మళ్లిస్తారు. రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి కంటైనర్‌కు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో పాటు వాహనం ముందు భాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రధాన సూత్రధారులు ఆఫీసుల్లో కూర్చుని లైవ్‌లో రోడ్డు కదలికలను గమనిస్తూ అప్రమత్తం అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement