సరిహద్దులు బార్లా తెరిచారు
సాక్షి, మదనపల్లె: జిల్లా నుంచి కర్ణాటకకు నిత్యావసర బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో జరిగిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. అయితే దీనిపై జిల్లా స్థాయిలో దాడులు, తనిఖీలు తగ్గడమేకాక కఠినమైన చర్యలు లేకపోవడంతో అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని కట్టడిచేసే మార్గాలు లేకపోతున్నాయి. ప్రధానంగా మదనపల్లె, బి.కొత్తకోట, బురకాయలకోట కేంద్రాలుగా రేషన్‌బియ్యం దందా దర్జాగా సాగుతోంది. పేదలకు నిత్యవసర చౌకడిపోల ద్వారా కిలో బియ్యం రూపాయికే పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం అక్రమ వ్యాపారులకు ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజమార్గంలో చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్‌న్స్, పౌరసరఫరాల శాఖలు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా అక్రమ వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.
వ్యక్తుల ద్వారా సేకరణ
మదనపల్లె, బి.కొత్తకోటల్లో అక్రమ రేషన్‌బియ్యం నిల్వ గోదాములు నిర్వహిస్తుండటం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బంగార్‌పేట, కోలారు ప్రాంతాలకు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలానికి చెందిన వ్యక్తులు తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రేషన్‌బియ్యాన్ని సేకరిస్తుంటారు. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న వ్యాపారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా ఆయా ప్రాంతాలనుంచి పేదలకు రేషన్‌బియ్యం కిలోకు రూ.10 నుంచి రూ.14 వరకు చెల్లిస్తామని ఆశచూపి సేకరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, రవాణా వాహనాల్లో బి.కొత్తకోట, మదనపల్లెల్లోని గోదాములకు తరలించి, రాత్రివేళల్లో కర్ణాటక సరిహద్దును దాటించి ఆ రాష్ట్రంలోని బంగారుపేట మిల్లులకు తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడి మిల్లుల్లో బియ్యానికి పాలిష్ చేసి కొత్త బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి వాటిని తిరిగి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నట్టు తెలుస్తోంది.
జిల్లాలో 4,29,269 రేషన్ కార్డులు
జిల్లాలో మొత్తం 4,29,269 నిత్యావసర రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మదనపల్లె నియోజకవర్గంలో 89,668 కార్డులు, పీలేరు నియోజకవర్గంలో 88,589, పుంగనూరు నియోజకవర్గంలో 68,410, రాయచోటి నియోజకవర్గంలో 96,626, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 85976 కార్డులు ఉన్నాయి. అలాగే జిల్లాలో మొత్తం 992 నిత్యావసర చౌక ధరల డిపోలు నడుస్తున్నాయి. వాటిలో మదనపల్లెలో 164, పీలేరులో 258, పుంగనూరులో 159, రాయచోటిలో 208, తంబళ్లపల్లెలో 203 చౌక డిపోలు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు ప్రతినెల చౌక డిపోల ద్వారా 6481.789 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
కనుమరుగైన దాడులు
ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు, రవాణాపై విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ బృందాల దాడులు కరువయ్యాయి. ఒకవేళ దాడులు చేసిన చౌకడిపోల్లో నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. బి.కొత్తకోటలో గతవారం ఒక చౌకడిపో నుంచి బియ్యాన్ని వాహనంలో తరలిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఇలాంటి ఘటనలు సాగుతున్నా దాడులు లేవు. దీనిపై సరైన చర్యలు చేపట్టాల్సి ఉంది.
మదనపల్లె, బి.కొత్తకోట కేంద్రాలుగా కర్ణాటకకు భారీగా తరలిపోతున్న సబ్సిడీ బియ్యం
సరిహద్దులో తనిఖీలు నామమాత్రం
దాడులు మరచిన విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ
మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. మదనపల్లె రూరల్, రామసముద్రం, బి.కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం మండలాల సరిహద్దుల్లో గతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడంతో ఇప్పుడు ఈ మార్గాల్లో వెళ్లే అక్రమ బియ్యం వాహనాలను తనిఖీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మదనపల్లె సమీపంలో చీకలబైలు వద్ద ఎకై ్సజ్, మార్కెటింగ్‌శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ చెక్ పోస్ట్ లేదు. అక్రమ బియ్యంపై ఈ శాఖల ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా బియ్యం కర్ణాటక బాట పడుతోంది.
మూడేళ్లక్రితం బి.కొత్తకోట కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై అప్పటి ఎస్‌ఐ రామమోహన్ దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 6.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమో దు చేశారు. ఇదే గోదాముపై దాడిచేసిన రెవెన్యూ అధికారులు 20 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మదనపల్లెలోని ఈశ్వరమ్మకాలనీ, ఇండిస్ట్రీయల్ ఎస్టేట్‌లోని రెండు రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. గతవారం బి.కొత్తకోటలో ఓ చౌకదుకాణం నుంచి తరలిస్తుండగా 22 బస్తాల బియ్యం పట్టుబడింది. మదనపల్లె రైస్‌మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడిందంటే ఈ దందా ఎంత యథేచ్ఛగా సాగుతోందో అర్థమవుతుంది. గతేడాది రెడ్డీస్ కాలనీలో 150 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎక్కడెక్కడ గోదాములు నిర్వహిస్తున్నారో తెలిసినా ఎందుకు పట్టించుకోకపోవడం వెనుక కారణ మేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు ఒకసారి కర్ణాటక వ్యాపారిపై కేసు నమోదు చేయగా, మళ్లీ అదేవ్యక్తి గోదాము నుంచి రెవెవెన్యూ అధికారులు రేషన్‌బియ్యం సాధ్వీనం చేసుకొన్నారు. అయితే ఈ అక్రమ దందాను మాత్రం నిలువరించలేకపోతున్నారు.


