ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం

ఓటర్లకు మ్యాపింగ్‌పై అవగాహన కల్పించండి

రాయచోటి అర్బన్‌: ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్‌ఏలు కీలకమని, ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని, అక్రమంగా చేస్తున్న ఓట్ల తొలగింపును అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)లో బూత్‌ లెవల్‌ ఏజెంట్ల(బీఎల్‌ఏ)ల పాత్ర కీలకమైనదన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమంగా చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓట్లు జాబితాలో ఉండేలా నిబద్ధతతో పని చేయాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులతో అభ్యంతరాలు ఉంటే తక్షణమే నిబఽంధనల ప్రకారం సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగకుండా, అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఫారం–6,7 తో పాటు జాబితాలో దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్నప్పటికీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగిస్తారు అనే విషయాలను స్క్రీన్‌పై వివరించారు. ప్రతి ఓటు ఎంతో విలువైనది, ఒక్క గ్రామంలో ఒక్క ఓటు, మండలం, నియోజకవర్గ స్థాయికి చేరేసరికి వేలల్లో మార్పు చూపుతుందని, అది గెలుపును ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల అయ్యేవరకు జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేయాలన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తోందని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడులో వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారనే కానీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించ లేదన్నారు. రెండేళ్ల పాలనలో వారు చెప్పుకునేదానికి ఏ సంక్షేమ, అభివృద్ధి పథకం లేవన్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తీసేసి, ఈ ప్రాంత ప్రజల కలలను చిదిమివేశారని ఆయన ధ్వజమెత్తారు.

● త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తోడుగా, అండగా ఉంటామని శ్రీకాంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. గత జగన్‌ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్‌ ఖాన్‌, రాయచోటి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు , మాజీ ప్రజాప్రతినిధులు , బూత్‌ కమిటీ ఏజంట్లు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అర్హులైన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను పోగొట్టుకోకుండా చూడాలి. ఎస్‌ఐఆర్‌ జరిగిన ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 34లక్షలు, గుజరాత్‌లో 68లక్షలు, తమిళనాడులో 74లక్షలు, పశ్చిమబెంగాల్‌లో 91లక్షల ఓట్లు తొలగించారు. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. దీన్ని బీఎల్‌ఏలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా ఎదుర్కోవాలి.

– ఆకేపాటి అమరనాథరెడ్డి,

వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

బీఎల్‌ఏలు సైనికుల్లా పని చేయాలి

వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు నెల రోజుల పాటు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అనుంబంధ సంఘాలతో సమన్వయం చేసుకుని పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగకుండా కృషి చేయాలి. ఇప్పటి వరకు గమనిస్తే ఎస్‌ఐఆర్‌ జరిగిన అన్ని రాష్ట్రాల్లో భారీగా ఓట్ల తొలగింపు జరిగింది. రాబోవు అన్ని రకాల ఎన్నికలను సమర్థఽవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలి. – సురేష్‌ బాబు, వైఎస్సార్‌

సీపీ రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు

ఎస్‌ఎస్‌ఆర్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ , ఎస్‌ఐఆర్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ల గురించి రీసోర్స్‌ పర్సన్‌ , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి వివరించారు. ఎస్‌ఐఆర్‌లో రెండు ఫేజ్‌లు ప్రీ ఎన్యూమరేషన్‌, ఎన్యూమరేషన్లు ఉంటాయన్నారు. ప్రీ ఎన్యూమరేషన్‌లో బీఎల్‌ఓలు 2025 ఓటరు జాబితాను 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్‌లో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ అయిన వారికి ఫారం వివరాలతో ఫ్రీ ఫిల్డ్‌గా వస్తుందని, వారు కేవలం ఫొటో అంటించి , సంతకం చేసి బీఎల్‌ఓకు ఇవ్వాలన్నారు. మ్యాపింగ్‌ కాని వారికి వారు ఎన్యూమరేషన్‌ ఫారంలో వివరాలు నింపి , బంధుత్వ ఆధారాలు, అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు. మ్యాపింగ్‌ నిరూపించుకోలేని వారు ప్రభుత్వం నిర్దేశించిన 13 పత్రాలలో ఏవైనా రెండు సమర్పించాలన్నారు. బీఎల్‌ఏలు, స్థానిక నాయకులు ప్రతి ఇంటినీ సందర్శించి , ఓటర్లలందరికీ పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోతో పాటు గుర్తింపు కార్డును రెడీగా పెట్టుకోమని చెప్పాలని ఆమె సూచించారు. బీఎల్‌ఏ రోజుకు 50 ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించవచ్చునన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వజ్ర భాస్కర్‌ రెడ్డి, అన్నమాచార్య కరస్పాండెంట్‌ ఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ కమిటీ సభ్యులు జల్లా సుదర్శన్‌ రెడ్డి, యధుభూషణ రెడ్డి, రాయలసీమ ఇన్‌చార్జి నరసింహారెడ్డి, సర్కాజీ, చిదంబర్‌ రెడ్డి తదితరులు బీఎల్‌ఏలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఎల్‌ఏలే కీలకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement