● కారు ఢీకొని బాలుడి మృతి
● కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
కేవీపల్లె : ‘అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మండలంలోని కలికిరివాండ్లపల్లె వద్ద ఆదివారం కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. మదనపల్లెకు చెందిన ప్రసాద్ కుమారుడు త్రినేష్(6) కలికిరివాండ్లపల్లెలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం త్రినేష్ రోడ్డుపైకి రావడంతో పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ త్రినేష్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడికి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


