మదనపల్లె టౌన్ : మదనపల్లి మండలంలోని మాలేపాడులో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దారి, భూ వివాదాల కారణంగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన మధుకర్‌రెడ్డిని పొలాల్లో ఉండే కాయలు కోయనీయలేదని.. అదే పార్టీకి చెందిన మరో వర్గంలోని జాఫర్ బాషా దారి నిలేశాడు. ఇప్పుడు మధుకర్‌రెడ్డి రహదారిని మూసి జాఫర్ బాషాను రాకుండా రోడ్డు దిగ్బంధం చేయడంతో వివాదం తలెత్తి ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మాలేపాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మాలేపాడుకు చేరుకుని గొడవలు జరగకుండా సర్ది చెప్పి రెండు వర్గాలకు దారి సమస్య పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వివాదం సద్దుమణిగింది.


