మదనపల్లె టౌన్ : దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లె మండలం సీటీఎం కొత్తపేటకు చెందిన బాలాజీ(45) ఆదివారం చిన్నతిప్పసముద్రం చెరువుకు బట్టలు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొరపాటున లోతైన నీటిలో పడి మునిగి పో యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు తాలూకా పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలాజీ మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ దుర్మరణం
చిన్నమండెం : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్ సమీపంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) అనే మహిళ దుర్మరణం చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె : కుటుంబ కలహాల కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని పరికిదొనపంచాయతీ నుంజార్లపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథథనం మేరకు... వెంకటచలపతినాయుడు(49)కు కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెంది గడ్డి నివారణ మందు తాగి అపస్మారస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నైతిక విలువలు, వృత్తి
నైపుణ్యాలతో విశ్వసనీయత
కడప సెవెన్‌రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్‌కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్‌కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.


