పుంగనూరు : మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ , రైతులపై దాడులు చేస్తుండటంతో.. వారు శనివారం రాత్రి మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి, ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం మిట్టచింతవారిపల్లెకి చెందిన రైతు వెంకటరమణ రాత్రి 10 గంటల సమయంలో టమాటాలు ట్రాక్టర్‌లో వేసుకుని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న లారీ డ్రైవర్ ట్రాక్టర్‌కు అడ్డుపెట్టి దూషించడం జరిగింది. దీనిపై రైతు వెంకటరమణ ప్రశ్నించే సమయంలో డ్రైవర్, అతని అనుచరులు కలసి.. వెంకటరమణను కిందకు పడేసి కొట్టి గాయపరిచారు. దీనిపై రైతులు రాత్రి గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. కమీషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, అడిగితే ప్రైవేటు వ్యక్తులచే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో సీఐ మాట్లాడారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని, ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
గేటుకు తాళం వేసి రైతుల ఆందోళన


