● న్యాయం చేయాలని డిమాండ్
● అనుమానాస్పద స్థితిలో
మృతి చెందినట్లు వెల్లడి
కలకడ : తమ వాడిని కొట్టి చంపారని, పోలీసులు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్(48) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాబునాయక్ మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య శంకరమ్మ, కుటుంబ సభ్యులు.. మృతదేహంతో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కె.బాటవారిపల్లె బిసి కాలనిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గంట సమయం పైగా రోడ్డుపై రాకపోకలను నిలిపి వేశారు. ఈ సమస్యపై స్పందించిన కలకడ పోలీసులు న్యాయం చేస్తామని పోస్ట్‌మార్టం ఆధారంగా కేసు ముందుకు సాగుతుందని తెలిపినా మృతుడి బంధువులు వినలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న కేవీపల్లె ఎస్‌ఐ బీవీ శివకుమార్ అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


