ప్రకృతి ఒడిలో సేదతీరాలని వెళ్లిన ఆ దంపతులకు, అదే ప్రకృతి కడుపుకోత మిగుల్చుతుందనడానికి ఆ కొండపై ఉన్న ఆ చిన్న సమాధే సాక్ష్యం. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో చల్లని గాలులతో మురిపించే హార్సిలీ హిల్స్ వెనుక ఒక శతాబ్దం నాటి గుండె బరువెక్కించే వింత విషాదం దాగి ఉంది.అప్పట్లో ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన డబ్ల్యూ.డి. హార్సిలీ ఈ కొండను కనుగొని, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడయ్యారు. ఆ మమకారంతోనే తన నిండు గర్భిణి అయిన భార్యను తీసుకుని కొండపై వేసవి విడిదికి వచ్చారు. అంతా సంతోషంగా సాగుతున్న వేళ.. 1864 మే 31న ఆ తల్లి కడుపు పండింది, ఒక పసికందు పుట్టాడు. కొండంత ఆనందంతో ఆ తండ్రి ఉప్పొంగిపోయాడు. కానీ, విధి ఆ సంతోషాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు.పురిట్లోనే ఆ పసిగుండె ఊపిరి ఆగిపోయింది. దీంతో ఆ దంపతుల రోదన కొండ గుహల్లో ప్రతిధ్వనించింది. ఆ బిడ్డకు ‘జార్జ్ హార్సిలీ’ అని నామకరణం చేసి, కొండపై తమకున్న ప్రేమకు గుర్తుగా ఆ పసికందు మృతదేహాన్ని అక్కడే ఖన నం చేశారు. ఇప్పటికీ ఆ చిన్నారి సమాధి.. పర్యాటకులను పలకరిస్తూ ఆనాటి కలెక్టర్ దంపతుల హృదయ వేదనను మౌనంగా కథలుగా చెబుతూనే ఉంది. –సాక్షి, మదనపల్లె
నట్టనడుమ ఒక్కరోజు కూడా లేని జీవితం


