– నలుగురికి గాయాలు
గాలివీడు: మండలపరిధి అరవీడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం క్రాస్ సమీపంలో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొ న్న ఘటనలో నలుగురు గా యపడ్డారు. ఈ ఘటనలో గాయత్రి, పూజిత, సోమే శ్వరతో పాటు బస్సు డ్రైవర్ ఎం. తిరుమలయ్య గా యాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మదనపల్లె టౌన్: పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కుటుంబీకులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం లోని కోళ్లబైలు పంచాయతీ, వైఎస్ జగన్ కాలనీలో నివాసం ఉంటున్న మంజునాథ కుమారులు రేవంత్ కుమార్ (15), రంజిత్ (13) స్థానిక నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరి కల్యాణ మండపం వద్ద ఉన్న ఆలయానికి పూజ కోసం వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి బైక్‌పై కాలనీకి వెళ్తుండగా, అమ్మ చెరువుమిట్ట మూడురోడ్ల కూడలి వద్ద మరో బైక్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు.స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె టౌన్: గుడికి విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం బసినికొండ లో నివాసం ఉంటున్న అరుణ్ (20) పోతపోలు గ్రామం సిద్ధమ్మగారిపల్లెలో ఉన్న రాముల గుడిలో పూజలు జరుగుతుండ టంతో డెకరేషన్ పనుల కోసం వెళ్లాడు. గుడి పైకి ఎక్కి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తు ఉండగా ప్రమాద వశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితున్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరు: అతివేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు గాయపడగా , వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడినాయునిపల్లెకి చెందిన భానుప్రసాద్ (25), గుట్టపల్లెకి చెందిన రేవంత్(23) ఇద్దరు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా పట్టణంలోని కొత్తయిండ్లు సమీపంలో ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భానుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. రేవంత్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు భానుప్రసాద్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు ఆసుపత్రికి తరలించారు.
పిడుగుపాటుతో మహిళ మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.
గాయపడిన రంజిత్, రేవంత్ కుమార్


