వివాహిత ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

మదనపల్లె టౌన్‌: కుటుంబ కలహాలతో ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. ములకలచెరువు మండలం, సోంపాల్యం పంచాయతీ, గొడ్డావుల కోటకు చెందిన మంజునాథ భార్య మీనాక్షి (32) కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ములకల చెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పశువుల లారీ సీజ్‌

మదనపల్లె టౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా 28 పశువులను ఒకే లారీలో ఊపిరి ఆడకుండా కుక్కి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ ఆర్ముగం, క్లీనర్‌ గౌతమ్‌ పులివెందుల, కదిరి ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి పలమనేరు వైపు తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ లారీ పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పశువులను చీకటివారిపల్లె గోశాలకు తరలించి పశువైద్యులతో చికిత్స అందించారు. కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఉన్నవారిపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు తెగిన చేయి

వాల్మీకిపురం: పాడిఆవులకు పచ్చిగడ్డిని యంత్రంతో కత్తరిస్తుండగా అందులో రైతు చేయి చిక్కుకుపోయి ప్రమాదవశాత్తు తెగిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు..పట్టణానికి చెందిన రమేష్‌బాబు (48) కొంత భూమిని కౌలుకు తీసుకొని అందులో పశువులకు మేత వేసుకొని పాడి ఆవులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం పశువుల మేతను కత్తిరించేందుకు యంత్రంలో గడ్డి వేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు రైతు కుడి చేయి యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. కుటుంబ సభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మదనపల్లెకు రెఫర్‌ చేశారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో శస్త్ర చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement