అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

మదనపల్లె టౌన్‌: అప్పుల బాధ తాళలేక రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మాలేపాడు పంచాయతీ, ఆవుల పల్లెకు చెందిన వెంకటేష్‌ (38)కు సుమారు 8 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పంటల సాగు కోసం తన పొలంలో ఏడు బోర్లు వేశాడు. ప్రస్తుతం టమాటా ఇతర కూరగాయ పంటలను పండించాడు. అయితే బోర్లలో నీళ్లు అడుగంటి పోవడంతో పంటలకు సరిపడా నీళ్లు లేక ఎండు ముఖం పడుతున్నాయి. ఇప్పటికే 7 బోర్లు, వ్యవసాయ పంటల సాగు, ఇతర ఖర్చులకోసం సుమారు 20 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెందాడు. కూరగాయ పంటలకు తెచ్చిన గడ్డి మందును పొలంలోనే తాగాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు వెంకటేశును స్థానకంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement