జిల్లా ఎస్పీ ధీరజ్
మదనపల్లె టౌన్: సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన పోలీసులు శేష జీవితాన్ని కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. శనివారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు ఏఎస్‌ఐలైన మాబూ సాహెబ్ (కలికిరి పీఎస్), పి. వెంకటరమణ (రామాపురం పీఎస్), ఎం. శేఖర్ రావు (రైల్వేకోడూరు పీఎస్)లకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి రిటైర్డ్ అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. పోలీసు అధికారులు సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వాముల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ కొనియాడారు. తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో పదవీ విరమణ పొందిన అధికారులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


