కలకడ : కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన రామానాయక్ కుమారుడు బాబునాయక్ (48) అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. కేవీపల్లె ఎస్‌ఐ బీవీ శివకుమార్ కథనం మేరకు..బాబునాయక్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. శనివారం ఉదయం బాబునాయక్ భార్య శంకరమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. శనివారం ఉదయం చిత్తూరు–కర్నూలు జాతీయరహదారి పక్కన కె.బాటవారిపల్లె బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న కార్పెంటర్‌దుకాణం(కొయ్యలమిషన్) వద్ద బాబునాయక్ మృతిచెంది ఉండటం గుర్తించి కలకడ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన మల్లేష్, రెడ్డెప్ప లతో కలిసి తన భర్త మద్యం తాగినట్లు తెలిసిందని, ఆయన మృతిపట్ల తనకు అనుమానాలు ఉన్నాయని శంకరమ్మ పోలీసలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్‌ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బాబునాయక్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


