గుర్రంకొండ: అటు వ్యవసాయం.. ఇటు ఉద్యానవన పంటలు చేతికందక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన జిల్లా రైతాంగాన్ని.. తాజాగా పౌల్ట్రీ (కోళ్ల) పరిశ్రమ సంక్షోభం మరింత కోలుకోలేని దెబ్బతీస్తోంది. జిల్లాలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరడంతో పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పాటు భానుడి భగభగలకు తట్టుకోలేక ఊపిరి వదులుతున్నాయి.
చేతికొచ్చే దశలోనే మృత్యువాత..
పతి కోళ్ల ఫారమ్‌లోనూ రోజుకు సగటున 30 నుంచి 40 కోళ్లు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల 15 నుంచి 25 రోజుల వయసున్న కోళ్లు చనిపోతుండగా, మరికొన్ని చోట్ల తీరా అమ్మకానికి సిద్ధంగా ఉన్న చివరి దశ కోళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నాయి. లక్షలాది రూపాయల మేత తినిపించి, కంటికి రెప్పలా కాపాడి, తీరా లాభాలు చేతికొచ్చే సమయంలోనే కోళ్లు మృత్యువాత పడుతుండడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.గుదిబండగా మారిన ‘కంపెనీ’ ఒప్పందాలు..కోడిపిల్లలను రైతులకు ఇచ్చే సమయంలో సాధారణ మరణాల (మోర్టాలిటీ) నష్టాన్ని పూడ్చడానికి ప్రతి 1000 పిల్లలకు అదనంగా 50 పిల్లలను కంపెనీలు ఉచితంగా ఇస్తాయి. అంటే 10 వేల కోళ్లు పెంచే రైతుకు అదనంగా 500 పిల్లలు వస్తాయి. ఈ అదనపు కోళ్లు చనిపోతే రైతుకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ, ఈ ఏడాది ఎండల తీవ్రత వల్ల మరణాల సంఖ్య ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది. ఆ 500 మార్జిన్ దాటి చనిపోయే ప్రతి అదనపు కోడి నష్టాన్ని, దాని మేత ఖర్చును పూర్తిగా రైతే భరించాలనే నిబంధన పౌల్ట్రీ రైతుల మెడకు ఉరితాడుగా మారింది.
జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత
ఎండల తీవ్రతను తగ్గించేందుకు పగటిపూట కోళ్ల ఫారాల రేకుల షెడ్లపై నిరంతరం నీటిని చల్లుతున్నారు. మరికొందరు రైతులు రేకుల షెడ్లపై కొబ్బరి మట్టలు (టెంకాయ పట్టలు), చెరువుల్లో లభించే జమ్ము (గడ్డి వంటి మొక్కలు)ను కోయించి వేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. దీంతో చేసేదేమీ లేక రైతులు చనిపోయిన వేలాది కోళ్లను జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తీయించి పూడ్చిపెడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పౌల్ట్రీ రైతాంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తక్షణమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్: కుప్పకూలుతున్న పౌల్ట్రీ పరిశ్రమ
భానుడి భగభగలకు జిల్లాలో రోజుకు 21 వేల కోళ్లు మృతి
రోజుకు రూ.35 లక్షల మేర బూడిద
కంపెనీల ‘మార్జిన్’ నిబంధనలురైతులకు శాపం
అదనపు మరణాల భారమంతావారి నెత్తినే!
షెడ్లపై జమ్ము వేసి నీళ్లు చల్లుతున్నా దక్కని ఫలితం
మృతిచెందిన కోళ్లను జేసీబీలతో గోతులు తీసి పూడ్చివేత


