మదనపల్లె సిటీ: జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక ఈనెల 31న నిర్వహించనున్నట్లు అన్నమయ్య హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ.వీ.ప్రసాద్, జి.శివప్రసాద్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ హాకీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. క్రీడాకారులు 1.1.1992 లేదా ఆ తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. పదో తరగతి మార్కుల జాబితా, పుట్టినతేదీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు జూన్ రెండో వారంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని పేర్కొన్నారు.
మదనపల్లి (కురబలకోట): ప్రజల ఆరోగ్యవంతమైన జీవనానికి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకమని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తంబళ్లపల్లి నియోజక వర్గ గ్రామాలకు రూ.70.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 22 ఈ–ఆటో రిక్షాలను శుక్రవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాలు వేరు చేయడం ఘన వ్యర్థాల నిర్వహణలో ఈ–ఆటో రిక్షాలు కీలక పాత్ర వహిస్తాన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో ఒక్కో వాహనం రూ. 3.20 లక్షల వ్యయంతో సమకూర్చినట్లు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ పరిశుభ్ర గ్రామాల నిర్వహణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, డీఎల్‌పీఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
కలికిరి: జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడమే జలధార ప్రాజెక్టు లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారి శివన్నారాయణ అన్నారు. కలికిరి కేవీకే కార్యాలయంలో శుక్రవారం పీలేరు నియోజకవర్గ పరిధిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రాజెక్ట్ జలధార ఉద్దేశంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 3272 చెరువులను జలధార కార్యక్రమం ద్వారా నీరు నింపడం జరుగుతుందని, దీంతో చెరువుల ఆయకట్టు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయన్నారు. జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి , జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై మాట్లాడారు.
రాయచోటి: విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడాలంటే ప్రాథమిక దశలోనే కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించాలని.. ఈ లక్ష్యంతోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్‌కు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం రాయచోటి మండలం, ఎగువ అబ్బవరంలోని ఆర్చనా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 29 నుంచి జూన్ 2వ తేది వరకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణను నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ ప్రారంభోత్సవంలో డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం – 2020, నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి మూడో తరగతి పూర్తయ్యే నాటికి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించడమే ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులు వయస్సుకు తగిన అభ్యసన స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన పద్దతులను అవలంబించాలని సూచించారు. డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఇన్‌చార్జ్ అసదుల్లా, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ జనార్దన్, ఏపిఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


