ఈ ఫొటోలో కనిపిస్తున్న బోర్డు కేవలం ఒక పట్టణ ఆహ్వాన సూచిక కాదు, కాల గర్భంలో దాగి ఉన్న ఒక గొప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల గుర్తులను మోస్తున్న మదనపల్లె పట్టణం ఇప్పుడు సరికొత్తగా పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆయన ఇక్కడి థియోసాఫికల్ కాలేజీలో విడిది చేసినప్పుడే, మన జాతీయ గీతం ‘జనగణమన’ను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఆ చారిత్రక క్షణానికి గౌరవంగా పీకేఎం(పలమనేరు, కుప్పం, మదనపల్లె) – ఉడా (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఒక అద్భుతమైన లోగోను సిద్ధం చేసింది. రవీంద్రుని రూపం, చుట్టూ ప్రకృతి అందాలు, సంప్రదాయ కలశం, గోవులతో కూడిన ఈ లోగో బోర్డులను బెంగళూరు, తిరుపతి, కడప, చిత్తూరు రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లెలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ ఈ బోర్డులు ఇకపై స్వాగతం పలుకుతూ ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేయనున్నాయి. –సాక్షి, మదనపల్లె


