● పోలీస్‌స్టేషన్ ముందు నుంచే
దర్జాగా వెళుతున్న ఇసుక టిప్పర్లు
● సవాల్ విసురుతున్న ఇసుకాసురులు
గుర్రంకొండ: పోలీసులా... అయితే మాకేంటీ అంటూ ఇసుకాసురులు పోలీస్‌స్టేషన్ ముందే దర్జాగా టిప్పర్లను తీసుకెళుతున్నారు. రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా షరా మామూలుగా మారింది. దీని గురించి అడిగేవారు..ఆడ్డుకొనేవారు ఎవరూ లేక పోవడంతో ఇష్టానుసారం ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఇసుక టిప్పర్ రోడ్డుపై వెళ్లిందంటే వాహనం వెనుక వెళ్లే ద్విచక్రవాహనదారుల కళ్లుమండిపోవాల్సిందే. గాలికి ఇసుక కొట్టుకువచ్చి కళ్లలో పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనావాసాల మధ్యలో వెళ్లేటప్పుడు ఇసుకపై పట్టగానీ, నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకోక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా తీరు మార్చుకోని ఇసుకాసురులు అధికారులకు, పోలీసులకు సవాల్ విసురుతూ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే పట్టకట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం.
జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గు ర్రంకొండ మీదుగా మదనపల్లె, కర్ణాటక వైపు నిత్యం వెళుతుంటాయి. గతంలో టిప్పర్లపై ఇసుక గాలికి ఎగిరి వెనుకవైపు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్లాస్టిక్ పట్టగానీ నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారం జనవాసాల మధ్యలో వెళుతుండడం గమనార్హం. ప్రతిరోజు గంటకోమారు ఇసుక టిప్పర్ వెళుతుండడంతో కష్టాలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే పోలీస్‌స్టేషన్ ముందు వైపు నుంచే దర్జాగా ఇసుక టిప్పర్లు వెళుతున్నా పట్టించుకోవడం లేదు.దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచని స్థితిలో ద్విచక్రవాహన దారులు, గ్రామస్తులు ఉన్నారు. ఇటీవల పోలీసులు ఇసుక టిప్పర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. దీంతో కొద్దిరోజుల పాటు జాగ్రత్తగా వీటిని తిప్పారు. అయితే మళ్లీ వారం రోజుల నుంచి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇసుక టిప్పర్లను తిప్పుతుండడం గమనార్హం. పోలీస్‌స్టేషన్ ముందే వాహనాలను నిలిపి జరిమానాలు విధించే పోలీసులు వాళ్ల కళ్లముందే ఇసుక టిప్పర్లు వెళుతున్నా చూసీచూడనట్లు వ్యహరిస్తుండడం విమర్శలు దారితీస్తోంది. ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలను రోజులో రెండుమార్లు నిలిపి జరిమానాలు విధించే పోలీసులకు ఇసుకటిప్పుర్లు కనిపించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.


