మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ | - | Sakshi
Sakshi News home page

మత్తు మందు చల్లి.. బంగారు గొలుసు అపహరణ

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

లింగాల : లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో పట్టపగలే మహిళ మెడలోని రూ.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు..చిల్లర దుకాణం నిర్వహిస్తున్న కేతిరెడ్డి సరళ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ముఖాలకు మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు సరకులు కొనేందుకు వచ్చారు. ఆమె సరకులు ఇస్తుండగా ముఖంపై మత్తు మందు చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. నిందితులు పులివెందుల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

ట్రావెల్‌ బస్సు బోల్తా

– ముగ్గురికి గాయాలు

గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్‌–67) జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్‌, అనంతపురం జిల్లా తలుపులకు చెందిన పవన్‌కుమార్‌, అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బద్వేలు రూరల్‌ ఎస్‌ఐ రంగారావు, సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకు ని బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడుపు నొప్పి తాళలేక

వివాహిత ఆత్మహత్య

ముద్దనూరు: మండలంలోని చెర్లోపల్లెకు చెందిన కుంచపు భారతి (37) కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. భారతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవారన్నారు. గురువారం నొప్పి భరించలేక విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement