● ఆక్రమణ నాటకం వారిది
● అధికారులు విచారించి
న్యాయం చేయాలి: బాధితుల వేడుకోలు
మదనపల్లె టౌన్: భూములు మావి, రెవెన్యూ రికార్డులన్నీ మా పేరుపైనే ఉన్నాయి. కానీ మా భూములు కబ్జా చేసి నిందలు మాపైనే వేస్తూ నాటకాలు ఆడుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి తమకు న్యాయం చేయాలని కురబలకోట మండలం, చేనేత నగర్‌కు చెందిన రావూరి అమరనాథ్ రెడ్డి, ఎరజ్రేనువారిపల్లెకు చెందిన రెడ్డెమ్మ, వై.అమరనాథ్ రెడ్డి దంపతులు, నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫైరోజ్ ఖాన్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఎరజ్రేనువారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 605–1, 606, 677 భూ వివాదానికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని రావూరి అమరనాథరెడ్డి తెలిపారు. నిబంధనల మేరకు 1979లో కొనుగోలు చేసిన స్థలంలోకి తమను రానివ్వకుండా కబ్జాదారులు ఎం. బాలకష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి అధికార పార్టీ అండతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన వద్ద ఉన్న రికార్డులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ భూవివాదంతో గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి, సర్వే అనంతరం అన్ని రిపోర్టులు తమకే అధికారికంగా ఇచ్చారన్నారు. వై.అమరనాథ్ రెడ్డి, రెడ్డమ్మ దంపతులు మాట్లాడుతూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని దాయాదులు వెంకటరమణారెడ్డి కబ్జా చేసి భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటు ఉన్నారన్నారు. ఆ వ్యక్తి రెండు నకిలీ ఖాతాలను తయారు చేసుకుని, తమ భూములను ఆక్రమించుకున్నాడన్నారు. అధికారుల రీ సర్వేలోనూ ఆన్ లైన్ తమకే చేసినా ఇంకా దౌర్జన్యం చేస్తున్నారని, ఇటీవలే తనపై దాడి కూడా చేశారన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. 605–1 లో తమకు వారసత్వంగా 8.80 ఎకరాల భూమి ఉందని, ఎన్. బాలకృష్ణారెడ్డి, జయరామి రెడ్డి లు కబ్జాచేసి తమను పొలంలోకి రానివ్వడం లేదని ఫైరోజ్ ఖాన్ ఆరోపించాడు. పిజిఆర్‌ఎస్ లో ఫిర్యాదు చేయగా, రీ సర్వే చేయనివ్వకుండా బాలకృష్ణా రెడ్డి, జయరామిరెడ్డి లు అధికారులను అడ్డుకుంటున్నా రన్నారు. ఉన్నతాధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.


