జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె టౌన్: మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వారిపై నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ దండాయన’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘స్పీడ్ ట్రయల్ మానిటరింగ్’విధానాన్ని జిల్లాలో వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస, పొక్సో కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలపై నేరాల్లో (క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్) 16 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేలా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. సంచలనాత్మక కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ. జి.శంకర మల్లయ్య, కోర్ట్ మానిటరింగ్ ఇన్స్పెక్టర్ జె. ప్రసాద్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, డీసీఆర్ బి, ఎస్‌ఐ.బి. సహదేవి, తదితరులు పాల్గొన్నారు.


