సాక్షి, అన్నమయ్య: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో, జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమం తీవ్ర నిరాశను మిగిల్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమం శూన్యం కావడంతో జనాలు, చివరికి సొంత పార్టీ క్యాడర్ కూడా సభలకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అధిష్టానం ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో, స్థానిక నేతలు జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించారు. కొన్ని చోట్ల డబ్బులు ముట్టజెప్పి మరీ సభలను నింపే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్ల అంతర్గత విభేదాలు, కొట్లాటలు ఈ మహానాడు వేదికగా బహిర్గతమయ్యాయి.
పుంగనూరు: వీధికెక్కిన ‘మూడు ముక్కలాట’
అధిష్ఠానం ఆదేశాలను తుంగలో తొక్కడంలో పుంగనూరు తమ్ముళ్లు ముందు నిలిచారు. నియోజకవర్గ నేత చల్లా రామచంద్రారెడ్డి, వ్యాపారవేత్త మధుసూదన్ నాయుడుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో మహానాడు మూడు ముక్కలైంది. మధుసూదన్ నాయుడు వర్గం ఒక ప్రైవేట్ హోటల్‌లో విడిగా సభ పెట్టి చల్లాపై బహిరంగ యుద్ధం ప్రకటించగా..చల్లా వర్గం పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లాలో సమావేశం జరుపుకుంది.వీరు కాకుండా మైనార్టీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మూడో సభ నిర్వహించారు. ఈ మూడు చోట్లా జనం లేక డ్వాక్రా మహిళలతోనే తూతూమంత్రంగా కానిచ్చేశారు.
రాయచోటి: మంత్రి వెళ్లగానే ఖాళీ..
జిల్లా అధ్యక్షుడే డుమ్మా!
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే రాయచోటిలో గ్రూపు తగాదాలు పీక్స్‌కు చేరాయి. మంత్రి ఉన్నంతసేపు కాస్తో కూస్తో కనిపించిన జనం, ఆయన వెళ్లగానే తిరుగుముఖం పట్టారు. దీనికి తోడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు వర్గం ఈ సభలకు పూర్తిగా దూరంగా ఉంది. జిల్లా అధ్యక్షుడే సొంత నియోజకవర్గాన్ని వదిలేసి వేరే ప్రాంతాల్లో తిరగడం ఇక్కడి తీవ్ర విభేదాలకు అద్దం పడుతోంది.
మదనపల్లె: ఎమ్మెల్యేకు సొంత పార్టీ
నుంచే బహిష్కరణ షాక్!
మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషకు వ్యతిరేక వర్గం నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని బలమైన ప్రత్యర్థి వర్గం, వారి అనుచర క్యాడర్ మొత్తం పూర్తిగా బహిష్కరించింది. దీంతో అక్కడ కూడా సభలన్నీ వెలవెలబోయి, కుర్చీలు మాత్రమే మిగిలాయి.
పుంగనూరు: ఈడిగపల్లె వద్ద మధుసూదన్ నాయుడు నిర్వహించిన సభ
పుంగనూరు: మరో వర్గం మాజీ కౌన్సిలర్లు,
మైనార్టీ నాయకులు నిర్వహించిన సభ
జిల్లాలో వెలవెలబోయిన‘పసుపు పండగ’
జనం కరువుతో డ్వాక్రా మహిళలతో సరిపెట్టిన వైనం
అధికారులు, పైసలే అండగా..మొక్కుబడి కార్యక్రమం
ఐక్యత శూన్యం.. అంతటా గ్రూపుల రాజ్యం
పుంగనూరులో ‘మూడు ముక్కలాట’
రాయచోటి, మదనపల్లెలో బహిష్కరణల పర్వం


