● జిల్లాలో ఏడాది కాలంలోనే 14 ఘోరాలు
● 5 కేసుల్లో నేటికీ దొరకని హంతకులు
● చార్జ్‌షీట్లు వేయడంలో పోలీసుల వైఫల్యం
● కోర్టుల్లో వీగిపోతున్న కేసులు!
మదనపల్లె టౌన్: జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లావ్యాప్తంగా సాగుతున్న హత్యల పరంపర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు వివిధ స్టేషన్లలో ఏకంగా 14 హత్య కేసులు నమోదు కాగా, పోలీసులు కేవలం 9 కేసుల్లోనే నిందితులను అరెస్ట్ చేయగలిగారు. మిగిలిన 5 కేసుల్లో హంతకులు నేటికీ పరారీలో ఉన్నారు.
నిందితులు దొరకని ఆ ‘5’ మిస్టరీ కేసులు ఇవే!
వాల్మీకిపురం: భూతగాదాల నేపథ్యంలో రైతు హత్య. ఇద్దరు స్నేహితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
మదనపల్లె: బోడుమల్లు దిన్నెలో రైతు రాజశేఖర్ రెడ్డి మర్డర్ జరిగి మూడేళ్లయినా ప్రధాన నిందితులు దొరకలేదు.
పీలేరు: ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య. ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు.
తంబళ్లపల్లె: పాత కక్షలతో కూలీ హత్య. నిందితులు కర్ణాటకకు పారిపోయినా పట్టుకోలేకపోయారు.
రామసముద్రం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం. ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్నది కూడా తేల్చలేదు.
మండలాల వారీగా హత్యల లెక్కలు:
మదనపల్లె–3, రాయచోటి–2, పీలేరు–2, తంబళ్లపల్లె–2, వాల్మీకిపురం–1, కురబలకోట–1, నిమ్మనపల్లె–1, సోమల–1, రామసముద్రం–1 చొప్పున జిల్లాలో హత్యలు జరిగాయి.
వైఫల్యానికి అసలు కారణాలు ఇవే!
జిల్లాలో 24 స్టేషన్లు ఉండగా, 6 సీఐ, 28 ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఎస్సై 3 నుండి 4 హత్య కేసులు డీల్ చేయాల్సి వస్తోంది. పైగా క్లూస్ నమూనాలు కడప ల్యాబ్‌కు పంపితే రిపోర్ట్ రావడానికి 3 నెలలు పడుతోంది. ఈ లోపే నిందితులు ఆధారాలు మాయం చేస్తున్నారు. సైబర్ సెల్‌లో సిబ్బంది లేకపోవడంతో నిందితుల ఫోన్ డేటా తెప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, జిల్లాలోని 180 మంది రౌడీషీటర్లపై నిఘా కరువైంది. గత 6 నెలల్లో జరిగిన 3 హత్యల్లో రౌడీషీటర్ల హస్తం ఉన్నా ముందస్తు చర్యలు లేవు. అలాగే 2022 నుంచి ఇప్పటివరకు పలు కేసుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్లు దాఖలు చేయలేదు. ఫలితంగా కోర్టుల్లో విచారణ మందగించి నిందితులు సులభంగా బెయిల్స్ తెచ్చుకుంటున్నారు.


