లోతుగా దుక్కు.. లాభాలు దక్కు! | - | Sakshi
Sakshi News home page

లోతుగా దుక్కు.. లాభాలు దక్కు!

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

జిల్లాలో ప్రారంభమైన ముందస్తు వర్షాలు

ముమ్మరమైన వ్యవసాయ పనులు

ఖరీఫ్‌లో 79,773 హెక్టార్ల పంటల సాగు లక్ష్యం

కలుపు, చీడపీడల నివారణకు

తొలి వర్షాలే సరైన సమయం

కడప అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటల దిగుబడిని దెబ్బతీసే ప్రధాన సమస్య ‘కలుపు’ మరియు ‘చీడపీడలు’. ఈ యాజమాన్య ప్రక్రియను తొలి వర్షాలు కురిసినప్పటి నుంచే ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ కోసం 79,773 హెక్టార్లలో పంటల సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించగా, జూన్‌ 1 నుంచి సీజన్‌ అధికారికంగా ప్రారంభం కానుంది.

వాలుకు అడ్డంగా దున్నాలి!

ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని తమ పరిధిలోని మాగాణి, మెట్ట, బీడు భూములను వెంటనే దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా దున్నడంతో పాటు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా పొలాల్లోనే ఆగుతుంది. ఇది నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకేందుకు అనుకూల పరిస్థితిని కల్పిస్తుంది. ఫలితంగా భూమి ఎక్కువ తేమను గ్రహించి, ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

చెత్తాచెదారం కాల్చవద్దు.. ఎరువుగా మార్చండి

చాలా మంది రైతులు పంటల నూర్పిడి పూర్తయిన తర్వాత, భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల పొలంలో మొండి కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి నేలను నిస్సారంగా మారుస్తాయి. అంతేకాకుండా పంట చేతికి రాగానే పొలంలో మిగిలిపోయే ఎండు ఆకులు, కోయకాడలను తగలబెడుతుంటారు. అలా కాల్చకుండా వదిలేసిన చెత్తను, ఇప్పుడు కురుస్తున్న వర్షం పదునులో లోతు దుక్కులు చేయడం ద్వారా సులభంగా మట్టిలో కలిసిపోయేలా చేయవచ్చు. ఇవి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోయి, భూమికి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా మారి భూసారాన్ని పెంచుతాయి.

పక్షుల వేట.. చీడపీడల కోట బద్దలు!

వేసవిలో పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పంటలను ఆశించే పురుగుల కోశస్థ దశలు, గుడ్లు, లార్వాలు మరియు తెగుళ్లు కలుగజేసే శిలీంధ్రాలు నేల అడుగున నిద్రావస్థలో దాగుంటాయి. ఇప్పుడు లోతు దుక్కులు చేయడం వల్ల నేల పొరలు తలకిందులై, ఇవన్నీ పైకి వస్తాయి. పొలం దున్నుతున్న సమయంలో నాగలి వెంట వచ్చే కొంగలు, కాకులు ఈ పురుగులను ఏరి తిని నాశనం చేస్తాయి. మిగిలినవి ఎండ తీవ్రతకు చనిపోతాయి. వర్షం పడగానే మొలకెత్తే కలుపు విత్తనాలు కూడా పంటల సాగుకు ముందే రెండు సార్లు దుక్కులు చేయడం వల్ల నశిస్తాయి. రసాయనాలతో దెబ్బతింటున్న నేలరైతులు శ్రమ తగ్గించుకోవడానికి విచ్చలవిడిగా రసాయన కలుపు మందులను పిచికారీ చేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన సారవంతం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే రసాయన మందుల వాడకాన్ని తగ్గించి, రైతులు ముందస్తు సేద్యం, లోతు దుక్కులు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, ఈ ఖరీఫ్‌లో జిల్లాలో ప్రధానంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌ తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.

రైతులు లోతు దక్కులు చేపట్టాలి

ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దుక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది.

– మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి, వైఎస్సార్‌జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement