పంటల బీమా అన్నదాతల హక్కు | - | Sakshi
Sakshi News home page

పంటల బీమా అన్నదాతల హక్కు

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

పులివెందుల/వేముల : ప్రకృతి ప్రకోపానికి గురై, అకాల గాలివానల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే మానవత్వంతో స్పందించి ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వేముల మండలంలోని మీదిపెంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌ఛార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిలతో కలిసి గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నేలకొరిగిన తోటలను చూసి చలించిపోయిన ఎంపీ, బాధితులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బలవంతంగా ప్రీమియం కటింగ్‌..

తీరా చూస్తే సాంకేతిక సాకులు!

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా అనేది రైతుల హక్కు అని, బీమా సంస్థ బాధ్యత తీసుకుని నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులకు ఇష్టం లేకపోయినా.. 2025లో పంట రుణాలు పొందిన ప్రతి రైతు వద్ద ఎకరాకు రూ. 3,000ల చొప్పున, హెక్టారుకు రూ.7,560ల చొప్పున బ్యాంకులు బలవంతంగా ప్రీమియం సొమ్మును కట్‌ చేసి రుణాలు రెన్యువల్‌ చేశారన్నారు. వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు ఈ విధంగా ప్రీమియం చెల్లించారని, దీని కవరేజీ 2025 జూలై నుంచి 2026 మే వరకు వర్తిస్తుందని గుర్తుచేశారు. కళ్లముందే ఇన్సూరెన్స్‌ గడువు ఉన్నప్పటికీ, సాంకేతిక సాకులు చూపడం దారుణమన్నారు. వాతావరణ బీమా అంటేనే ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల ఆధారంగా వర్షపాతం, గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని బీమా అందించాల్సి ఉంటుందని ఎంపీ వివరించారు. కానీ జిల్లాలో వెదర్‌ స్టేషన్లు చాలా చోట్ల సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ‘మరి పంటల బీమాకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చి రైతుల వద్ద ప్రీమియం వసూలు చేశారు?‘ అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహించొద్దని, మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహించి తప్పనిసరిగా ప్రతి రైతుకూ బీమా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement