నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : కర్ణాటక రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నిమ్మనపల్లి మండల యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. నిమ్మనపల్లి మండలం, వెంగంవారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి కుమారుడు వెర్రి హరీష్ (26) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శని, ఆదివారం గంగ జాతర ఉందని తల్లిదండ్రులు హరీష్‌ను ఇంటికి రమ్మని కోరారు. దీంతో హరీష్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని హెచ్ క్రాస్– కై వారం మధ్యలో టీవీఎస్ ఎక్సెల్‌లో వస్తున్న వృద్ధుడు హఠాత్తుగా రోడ్డుకు అడ్డు రావడంతో, బుల్లెట్ ఢీకొని హరీష్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న చింతామణి రూరల్ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం చింతామణి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
నిమ్మనపల్లి యువకుడు మృతి


