చిరుజల్లుల తొలకరిలో.. | - | Sakshi
Sakshi News home page

చిరుజల్లుల తొలకరిలో..

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

చిరుజల్లుల తొలకరిలో..

ఉపశమనం.. ఉరుము నష్టం!

సాక్షి, అన్నమయ్య: వేసవికాలంలో సూర్య భగవానుడి ప్రచండ వేడిగాలులకు, భానుడి భగభగలకు బెంబేలెత్తిన అన్నమయ్య జిల్లా ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం లభించింది. దాదాపు మూడు, నాలుగు నెలలుగా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు.. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వీస్తున్న చల్లగాలులతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకటి రెండు రోజులుగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో వాతావరణం మొత్తం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జూన్‌ నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా వాతావరణం ఇలా చల్లబడటం మంచి పరిణామమని జిల్లా వాసులు భావిస్తున్నారు.రాయచోటిలో అత్యధిక వర్షపాతంజిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో అత్యధికంగా 54.6 మి.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. అలాగే అత్యల్పంగా కలకడ మండలంలో 2.4 మి.మీ. వర్షం కురిసింది.ఉన్నఫళంగా వర్షం తీవ్రత పెరగడంతో పాటు ఈదురు గాలులు ముంచెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేసవి వేడితో అల్లాడుతున్న వాతావరణం ఈ ఆకస్మిక వానలతో ఒక్కసారిగా చల్లదనంతో నిండిపోయింది.

ఉపాధికి పోయి... పిడుగుపాటుకు గురై!

వాతావరణం చల్లబడి ఉపశమనం లభించినప్పటికీ, జిల్లాలో పిడుగుపాట్లు తీవ్ర ఆందోళన కలిగించాయి. అన్నమయ్య జిల్లాతో పాటు పొరుగున ఉన్న వైఎస్సార్‌ జిల్లాలో మూడు, నాలుగు చోట్ల భారీగా పిడుగులు పడ్డాయి. సంబేపల్లె మండలంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన ఒక కూలీ పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని అడవి కమ్మపల్లె గ్రామం బండకాడ హరిజనవాడకు చెందిన ఆంజనేయులు బుధవారం ఉదయం గ్రామ సమీపంలో ఉపాధి కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఆంజనేయులుపై పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గమనించి, తక్షణమే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు, కూలీలు ఎవరూ చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.’అబ్బా.. ఏం ఎండలు’.. తోటల్లో నేలరాలిన మామిడి ఏడాది వేసవి కాలంలో జిల్లా వ్యాప్తంగా ’వేసవి దెబ్బ... అబ్బా’ అనేలా రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం మొదలుకొని మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు అదరగొట్టడంతో భూగర్భ జలాలు కూడా చాలావరకు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్న సమయంలో రోడ్లు, మార్కెట్లు బోసిపోయి కనిపించాయి. కాగా, ప్రస్తు తం కురిసిన వర్షం జనాలకు ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలుల ధాటికి తోటల్లోని మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. చేతికొచ్చిన పంట ఇలా నేలపాలు కావడంతో మామిడి రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రాయచోటిలో అత్యధికంగా 54.6 మి.మీ. వర్షపాతం నమోదు

కలకడలో అత్యల్పంగా 2.4 మి.మీ..

సంబేపల్లెలో ఉపాధి హామీ పనులకు వెళ్లి.. పిడుగుపాటుకు గురైన కూలీ

రాత్రి వేళల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ముంచెత్తిన వాన

తోటల్లో నేలరాలిన మామిడికాయలు

Advertisement
 
Advertisement
Advertisement