జనగణనను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనను పారదర్శకంగా నిర్వహించాలి

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

గాలివీడు: ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. రాయచోటి డివిజన్‌లోని గాలివీడు, రామాపురం మండలాల్లో జరుగుతున్న జన గణన–2026 ఎన్యుమరేషన్‌ ప్రక్రియను బుధవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనగణన పూర్తిచేసిన గృహాలకు వేసిన డోర్‌ నంబర్లు, ఆన్‌లైలో నమోదు చేసిన సమాచారాన్ని రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. అలాగే ఖాళీగా ఉన్న, తాళం వేసిన గృహాలను ప్రత్యేకంగా పరిశీలించిన కలెక్టర్‌, ఆ గృహాలపై చుట్టుపక్కల వారిని అడిగి సమాచారం సేకరించారు. గాలివీడు మండలంలో బ్లాక్‌ నంబర్లు 47, 48, రామాపురం మండలంలో 47వ బ్లాక్‌ పరిధిలో పలు గృహాలను తనిఖీ చేసి, డోర్‌ నంబర్లు, యాప్‌లో నమోదైన సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మండలాలలో ఎన్ని ఖాళీ గృహాలు, తాళం వేసిన గృహాలు ఉన్నాయని కలెక్టర్‌ ప్రశ్నించగా, గాలివీడులో 2147 ఖాళీ, 55 తాళం వేసినవి, రామాపురం మండలంలో 1620 ఖాళీ, 76 తాళం వేసిన గృహాలు ఉన్నట్లు తహసీల్దార్లు వివరించారు. అనంతరం పలు అంశాల గురించి చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు భాగ్యలత, వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement