దివ్యత్యాగాలకు ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

దివ్యత్యాగాలకు ప్రతీక బక్రీద్‌

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

మదనపల్లె సిటీ : దివ్య త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగను గురువారం ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పండుగను ఈద్‌ ఉల్‌ అజ్‌ హా అని కూడా పిలుస్తారు. ఇస్లాం కాలమానంలోని 12వ నెల జిల్‌హజ్జా. ఈనెలలోని పదవ తేదీన పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ఓ చారిత్రక నేపథ్యం ఉంది. ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం అలైహిస్సలాంకు సంతానం కలగకుండా ఉంటే ఆ దంపతులు అనేక సంవత్సరాలు దైవప్రార్థనలు చేస్తారు. వారి ప్రార్థనలు ఫలించి తన 80వ ఏట ముదసలి వయసులో వారికి సంతానం కలుగుతుంది. అతనిని హజరత్‌ ఇస్మాయిల్‌గా నామకరణం చేస్తారు. ముదసలి వయసులో జన్మించిన తన ఏకై క కుమారుడు హజరత్‌ ఇస్మాయిల్‌ను వారు అత్యంత గారాబంతో పెంచుకుంటూ ఉంటారు. ఇదిలాఉండగా ప్రవక్త హజరత్‌ ఇబ్రహీంకు ఒక రోజు కల వస్తుంది. ఆ కలలో దైవం అతనితో మాట్లాడుతూ తనకు అత్యంత ప్రీతిపాత్ర అయిన దానిని దైవమార్గంలో బలి ఇవ్వమని కోరుతుంది. మరుసటి రోజు ఉదయం ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం దైవమార్గంలో తన కిష్టమైనటువంటి అనేక వస్తువులను దైవమార్గంలో ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రతి రోజు ఆ కల అలాగే వస్తూ ఉంటుంది. దీంతో ప్రవక్త హజరత్‌ ఇబ్రహీంకు అర్థమవుతుంది. తనకు అత్యంత ప్రీతి పాత్ర అయినటువంటి తన ఏకై క సంతానమైన హజ్రత్‌ ఇస్మాయిల్‌ అలైహిస్సలాం బలిని దైవం కోరుకుంటోందని, దీనిని గ్రహించిన హజరత్‌ ఇబ్రహీం అలైహిస్సలాం తనకు అత్యంత ప్రీతి పాత్ర అయినటువంటి తన ఏకై క సంతానమైన హజ్రత్‌ ఇస్మాయిల్‌ అలైహిస్సలాంను దైవమార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధపడుతారు. మరుసటి రోజు ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం తన ఏకై క సంతానమైన హజరత్‌ ఇస్మాయిల్‌ ను స్నానం చేయించి నూతన బట్టలు ధరింపజేస్తారు. అనంతరం తన భార్య, కుమారునితో మాట్లాడుతూ తనకు దైవం నుంచి వచ్చిన కల గురించి వివరిస్తారు. దీనికి వారు సమ్మతి తెలుపుతారు. మరుసటి రోజు ఉదయం ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం తన కుమారుడిని ఊరి బయటకు తీసుకెళ్లి పదునైన కత్తితో బలి చేయడానికి సిద్ధపడుతారు. ఓ వైపు దైవాజ్ఞకే పెద్దపీట వేసి తన కుమారుడిని బలి చేయుటకు నిర్ణయం తీసుకుంటారు. కత్తితో గొంతును కోయడానికి ఎంత ప్రయత్నించినా ఆ కత్తి తెగదు. కోపంతో కత్తిని విసరివేయగా ఆ సమయంలో దైవవాణి వినిపిస్తుంది. ఓ ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం నీకు దైవాజ్ఞ ఎక్కువో పుత్ర వాత్సల్యం ఎక్కువో కనుగొనుటకు నీకు పెట్టిన పరీక్షలో నీవు నెగ్గావు. నేను నీ కుమారుని బలి కోరుకోవడం లేదంటూ ఆకాశం నుంచి ఓ దుంబాను పంపించి ఖుర్బానీ చేయమని ఆదేశించడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్‌ పండుగ సందర్భంగా ఖుర్బానీ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ముస్తాబైన ఈద్గాలు:

జిల్లా కేంద్రమైన మదనపల్లెతో పాటు రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, పుంగనూరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, బి.కొత్తకోట ప్రాంతాలతో పాటు పలు మండల కేంద్రాల్లోని ఈద్గాలు బక్రీద్‌ పండుగకు ముస్తాబు చేశారు.

ఖుర్బానీ మూడు భాగాలుగా చేయాలి

ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇవ్వాలి. మరో భాగాన్ని తన కోసం వినియోగించాలి.

–హాఫీజ్‌ ఇక్బాల్‌ సాహెబ్‌, ప్రభుత్వ ఖాజీ, మదనపల్లె

నేడు ఈద్‌–ఉల్‌–అజ్‌హా పర్వదినం

Advertisement
 
Advertisement
Advertisement