రామసముద్రం : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక గ్రామం సుమారు 20గంటల పాటు అంధకారంలో చిక్కుకున్న సంఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కెసి.పల్లి పంచాయితీ గుంతఎంబాడీ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ విషయంపై గ్రామస్తులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇవ్వగా కొంతసేపట్లో మరమ్మతులు చేసి సరఫరా ఇస్తామని చెప్పి మిన్నకుండిపోయారు. దీంతో రాత్రంతా అంధకారం మధ్య గ్రామస్తులు జీవనం సాగించారు. మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా లైన్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డికి, లైన్ మాన్ రాజశేఖర్ కు విన్నవించినా ఇదిగో... అదిగో అంటూ కాలయాపన చేశారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు ల్యాప్ టాప్, మొబైల్ లకు ఛార్జింగ్ లు లేక పక్క గ్రామాలకు, సబ్ స్టేషన్ లకు వెళ్లి ఛార్జింగ్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 20గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో గ్రామంలో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడి వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీశారు. దీనిపై ట్రాన్స్ కో ఏఈ మస్తాన్ కు సమాచారం ఇచ్చేందుకు ఫోన్లు చేసినా ఆయన స్పందించలేదు. మధ్యాహ్నం లైన్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డికి ఫోన్లు చేసి ఒత్తిడి చేయడంతో ఆయన వచ్చి మరమ్మతులు చేశారు. అయితే ఒక గ్రామం 20 గంటల పాటు అంధకారంలో ఉన్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
20 గంటల పాటు అంధకారంలో
గుంత ఎంబాడి
లాప్ టాప్, మొబైల్ చార్జింగ్ ల కోసం పక్క గ్రామాలకు పరుగులు తీసిన ఉద్యోగులు


