మదనపల్లె టౌన్ : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపు కోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పండుగ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పండుగ పూట ఎలాంటి అపోహలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా చూడాలని అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిందని ఎస్పీ స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌న్‌స్ట్రాగామ్ వంటి సామాజిక వేదికల్లో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా గానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గానీ అభ్యంతరకర పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ


