30న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

30న జాబ్‌మేళా

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

30న జాబ్‌మేళా సీపీఎల్‌ సీజన్‌ –2లో ఫైనల్‌కు ఎన్‌కే స్పోర్ట్స్‌ వడదెబ్బతో ఉపాధి కూలి మృతి నియామక పత్రాల పంపిణీ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలి ఫుట్‌బాల్‌ జిల్లా సీనియర్‌ బాలుర జట్ల ఎంపిక

మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వనజ తెలిపారు. మెగా జాబ్‌మేళాలో 12 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మేళా జరుగుతుందన్నారు. ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చునన్నారు. పూర్తి వివరాలకు 95532 02509, 63016 12761 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో నాక్‌ అవుట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో క్వాలిఫైయర్‌ 1 విజేతగా ఎన్‌కే స్పోర్ట్స్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకొంది. ఇందులో ఫ్రతిభ చూపిన ప్రణవ్‌ రెడ్డికి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును ఆంధ్ర రంజి ప్లేయర్‌ జ్ఞానేశ్వర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌, సునీల్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

పెద్దమండ్యం: మండలంలోని ముసలికుంటలో మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన వలిపి వెంకట్రమణ (65) అనే కూలి వడదెబ్బకు గురై మృతి చెందాడు. నల్లచెరువు కాలువ పూడికతీత పనుల్లో భాగంగా గడ్డపారతో తవ్వుతుండగా ఆయన ఒక్కసారిగా వాంతులు చేసుకుని కుప్పకూలాడు. తోటి కూలీలు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏపీఓ సురేంద్రనాథ్‌రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌ మృతదేహానికి నివాళులర్పించారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూలీలు కోరారు.

కడప అర్బన్‌: కడప రిమ్స్‌ ప్రాంగణంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2025 సంవత్స రానికి ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. డ్యూటీ అటెండర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌,ప్లంబర్‌ తదితర పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ జమున పత్రాలు అందజేశారు.

మదనపల్లె సిటీ: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బీటీ కాలేజీ ఆవరణలోని జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయంలో హాస్టల్‌ వార్డన్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందించే సేవలు గురించి వివరించి అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. పదో తరగతిలో వసతిగృహ విద్యార్థులు జగదీశ్వరరెడ్డి 583, వినయ్‌ 579 మార్కులు సాధించారన్నారు. వీరిని ఈనెల 29న విజయవాడలో జరిగే కార్యక్రమానికి సంబంధిత వార్డన్లు తీసుకెళ్లాలన్నారు. ఏఎస్‌డబ్యూఓలు రాములునాయక్‌, గంగిరెడ్డి, క్రిష్ణ, వార్డన్లు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా పుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్‌ జిల్లా సీనియర్‌ బాలుర జట్ల ఎంపిక నిర్వహించారు. జిల్లాలో ని పలు ప్రాంతాల నుంచి సుమారు 50 మందికిపైగా క్రీడాకారులు ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ కార్యదర్శి కె.మురళీధర్‌ తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వారి ప్రతిభ, ఫిట్‌నెస్‌,ఆటతీరును పరిశీలించి తుది జిల్లా జట్టుకు 20 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. కార్యక్రమంలో పుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దిలీప్‌కుమార్‌, కిరణ్‌, మహేంద్రనాయక్‌, రతీష్‌, చంద్ర,చెన్నకేశవ, జాన్‌ కమలేష్‌, బాలాజీ, అంజనప్ప పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement