బ్యాక్‌డోర్ నియామకాల్లో.. జేబులు నింపిన కాంట్రాక్టర్!
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకోవడంలో దిట్ట. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పచ్చ చొక్కాల పిఫార్సులకు, పైసల సంచులకే పెద్ద పీట వేస్తున్నారు. కడప రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ సూపర్‌వైజర్ల నియామకాల్లో కూటమి నేతలు చేసిన పంపకాల బాగోతం, కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నిబంధనల ముసుగులో పాతవారిపై వేటు!
రిమ్స్ హాస్పిటల్ శానిటేషన్ కాంట్రాక్టును తిరుపతికి చెందిన ’పద్మావతి హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ సంస్థ అధినేత భాస్కర్ నాయుడు దక్కించుకున్నారు. ఆయన ఏడు విభాగాల్లో కాంట్రాక్టును కొనసాగిస్తూ.. పాత శానిటేషన్ సూపర్‌వైజర్లను తొలగించేందుకు పక్కా స్కెచ్ వేశారు. డిగ్రీ అర్హత ఉండాలని, 50 ఏళ్ల లోపు వారికే ఛాన్స్ అంటూ కొత్త షరతులు పెట్టి, అప్పటికే పనిచేస్తున్న దాదాపు 40 మందిని రోడ్డున పడేశారు. తీరా ఆ ఖాళీలను ’ఎల్లో బ్యాచ్’ సిఫార్సులతో భర్తీ చేయడం గమనార్హం.
మంత్రిని మించిన ’సూపర్ బాస్‌లు’.. ఎమ్మెల్యేలకే సింహభాగం!
ఈ నియామకాల్లో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కంటే చిత్తూరు జిల్లాలోని ఇద్దరు ’నాయుడు’లే తాము సూపర్‌బాస్‌లమని నిరూపించుకున్నారు. సదరు నాయుడు ద్వయం సిఫార్సు చేస్తే వారికి ఒక్కొక్కరికి 3 పోస్టుల చొప్పున కేటాయించిన కాంట్రాక్టర్.. స్వయంగా శాఖా మంత్రి సత్యకుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిల సిఫార్సులకు మాత్రం రెండేసి పోస్టులు ఇచ్చి సరిపెట్టారు. ఇక కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిఫార్సు చేసిన 11 మందిలో 8 మందిని, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి సిఫార్సు చేసిన 7 మందిని నియమించి ఎమ్మెల్యేలకే అగ్రస్థానం కల్పించారు.
ఎమ్మెల్సీకి ఒకటే.. అధికారులకూ వాటాలు!
కూటమిలో ఉన్న మిగిలిన నేతలను, అధికారులను సృప్తి పరిచేందుకు కూడా ఈ పోస్టులను నైపుణ్యంగా పంచారు. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సిఫార్సుకు కేవలం ఒకే ఒక్క పోస్టు దక్కగా, రిమ్స్ ప్రిన్సిపల్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ల సిఫార్సులకు ఒక్కొక్క పోస్టు ఇచ్చారు. నిబంధనల ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రిన్సిపల్‌ను కాదని.. సీఎస్, ఆర్‌ఎంఓ సిఫార్సులకు ఏకంగా 3 పోస్టులు కేటాయించడం హాస్పిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సిఫార్సుల పర్వం ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు ఈ శానిటేషన్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రతినిధులు కాసుల కనకవర్షంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హతలు, సిఫార్సులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ప్రతినిధుల జేబులు నింపితేనే పోస్టింగ్ ఆర్డర్లు చేతికిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుగారి మార్క్ ’పారదర్శకత’ రిమ్స్ ఉద్యోగాల పంపకాల్లో ఇలా బట్టబయలైందని బాధితులు మండిపడుతున్నారు.
కడప రిమ్స్ ఉద్యోగాల్లో పచ్చ నేతల‘పంపకాల’ జాతర!
శానిటేషన్ సూపర్ వైజర్ పోస్టులపంపకాల్లో కూటమి నేతల జులుం!
ఆరోగ్యశాఖ మంత్రి కంటే‘నాయుడు ద్వయం’ సిఫార్సులకేకాంట్రాక్టర్ పెద్దపీట!
నిబంధనల ముసుగులో పాతవారికిఉద్వాసన.. తమ్ముళ్లకు అగ్రతాంబూలం!
విద్యార్హతల సాకుతో పాతవారికి ఉద్వాసన.. ’ఎల్లో బ్యాచ్’కు అగ్రతాంబూలం!


