● మట్టి నమూనాల సేకరణకు శ్రీకారం
● భూమిలో సమతుల్యత సాధించడమే లక్ష్యం
● అధిక దిగుబడి పొందేందుకు అవకాశం
గుర్రంకొండ : ఎట్టకేలకు ప్రభుత్వం భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. తద్వారా పంటల సాగులో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. జిల్లాలో 2023 పంట పొలాల మట్టి నమూనాల సేకరణే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతుల పొలాల్లో మట్టిసేకరణ పనులు చేపడుతున్నారు. భూసార పరీక్షలకు ఇదే అనువైన సమయం. సారం కోల్పోయిన భూమిలో పోషక విలువలు సమతుల్యత సాధించడమే దీని ఉద్దేశం.
ఏడాది, మూడేళ్ల కొకమారు..
బోర్లు, బావులు, సాగునీటి కాలువల ద్వారా ఏడాది పొడువునా నీటిసౌకర్యం ఉన్న పొలాల్లో ఏడాదికొకమారు భూసార పరీక్షలు చేయించాలి. ప్రతి మూడు సీజన్‌లకొకమారు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశముంది. వర్షాధార పంటల సాగు భూముల్లో మూడేళ్ల కొకమారు భుసార పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రైతులు పంటలు సాగు చేసిన ప్రతి సారి భూమిలో నత్రజని, భాస్వరం వినియోగం ఎక్కువగా ఉంటుంది. భూసార పరీక్షలో భూమిలో ఎంత మేరకు వీటి శాతం తగ్గిందో తెలుసుకోవచ్చు. తద్వారా పంటసాగు చేసే ముందు పొలంలో తగినంత మేరకు వీటని పిచికారి చేస్తే భూసారం మళ్లీ యథాస్థితికి చేరుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల పొలం గుల్ల బారిపోకుండా జాగ్రత్త పడవచ్చు.
ఏప్రిల్, మే నెలలు అనుకూలం
భూసార పరీక్షల కోసం పొలాల్లో గానీ, భూమిలో గానీ మట్టినమూనాలను సేకరించేందుకు ఏప్రిల్, మే నెలలు అనుకూలంగా ఉంటాయి. ఏడాదిలో ఈ రెండు నెలల్లో చాలా వరకు పొలాల్లో పంటలు సాగు ఉండదు. దీంతో బీడు భూములు అధికంగా ఉంటాయి. అప్పడు మట్టినమూనాలు సేకరిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయనేది వ్యవయసాయాధికారుల నమ్మకం.
21 రోజుల్లో ఫలితం
మట్టి నమూనాలను వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. వీటి ఫలితాలను 21 రోజుల తరువాత ప్రకటిస్తారు. ఆర్బీకే సిబ్బంది భూసార పరీక్షల ఫలితాన్ని సదరు పొలం రైతుకు తెలియజేస్తారు. తద్వారా సదరు పొలంలో నత్రజని, పొటాష్, భాస్వరం, కాల్షియం, ఐరన్‌తోపాటు ఉదజని సూచిక, సేంద్రీయ కర్బనం వంటివి ఎంత మేరకు ప్రస్తుతం భూమిలో ఉన్నాయో ఫలితాలు సూచిస్తాయి. దీంతో పొలంలో భుసారాన్ని పెంపొందించేందకు ఏలాంటి పోషక విలువలు కలిగిన ఎరువులు వాడాలో సూచిస్తారు.
జిల్లాలో 2020 మట్టి నమూనల సేకరణే లక్ష్యం
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 2023 పొలాల్లో మట్టినమూనాలు సేకరణే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ సీజన్‌లోనే పొలాల్లో మట్టిసేకరణ చేసి ఫలితాలను ఇవ్వాలనే లక్ష్యం నిర్దేశించుకొన్నారు. త్వరగా లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మట్టిసేకరణ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది మట్టినమూనాలను సేకరిస్తున్నారు.


