వెల్లువెత్తిన రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన రైతుల నిరసన

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

సాక్షి, మదనపల్లె : ములకలచెరువులో రైతాంగం నిరసన వెల్లువెత్తింది. మార్కెట్‌లో రైతులు తీవ్రంగా నష్టపోకుండా అధికారులు అండగా నిలవాలని రైతు సంఘం నాయకులు కోరారు. టమాట రైతుల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ములకలచెరువు మార్కెట్‌లో అమలు అయ్యేలా మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం తంబళ్లపల్లె నియోజకవర్గం వర్గానికి చెందిన రైతులు, రైతు సంఘ నాయకులు పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ములకలచెరువు మూడు రోడ్ల కూడలి నుంచి రైతులు ప్లకార్డులు, బ్యానర్‌తో మార్కెట్‌ యార్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. జాక్‌ పాట్‌ నిలిపివేయాలని, కమీషన్‌ రద్దు చేయాలని, 15 కిలోల క్రేట్ల విధానం అమలు చేయాలని, తలసరి మట్టం వరకే టమాట ఉండాలన్న డిమాండ్లతో రైతులు ఈ కార్యక్రమం చేపట్టారు. మార్కెట్‌ కార్యాలయం వద్దకు చేరుకుని గంటన్నరకు పైగా నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. దోపిడీకి గురవుతున్న రైతులను కాపాడాలని, ప్రభుత్వ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని నినాదాలు చేశారు. వ్యాపారులు నిబంధనలు పాటించి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు మద్దతు ఇవ్వండి

కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు వద్దకు మార్కెట్‌ కార్యదర్శి నవీన్‌ కుమార్‌రెడ్డి వచ్చారు. రైతులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకుడు బి.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ములకలచెరువు మార్కెట్లో రైతుల నుంచి కమీషన్‌ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. జాక్‌ పాట్‌ విధానంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, వేలంపాటలో రైతు పంటకు పలికే ధర ఒకటైతే రసీదులో మరో ధర రాస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాలు ఇకపై జరగకుండా అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పంట పెట్టింది మొదలు ఎరువులు, పురుగుమందులు, టమాట నారు, కూలీల సమస్యలు, పెరిగిన పెట్టుబడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట దిగుబడి మార్కెట్‌కు తెస్తే రైతులను నిలువునా మోసం చేస్తున్నారని, ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కార్యదర్శికి విన్నవించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మేరకు మార్కెట్లో నిబంధనలు అమలు కాకుంటే వచ్చే నెల 10 తర్వాత రైతులతో ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.

కమీషన్‌ తిరిగి ఇప్పిస్తాం

ములకలచెరువు మార్కెట్లో 10 శాతం కమీషన్‌ వసూలుపై రైతు సంఘ నాయకులు పద్మనాభరెడ్డి కార్యదర్శి నవీన్‌ కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆయన కమీషన్‌ వసూలును అంగీకరిస్తూనే ఏడీ త్యాగరాజతో ఫోన్లో రైతులతో మాట్లాడించారు. మొదట ఏడీ కలెక్టర్‌ సమక్షంలో 10 శాతం కమీషన్‌ వసూలుకు రైతులు అంగీకరించారంటూ చెప్పుకొచ్చారు. తర్వాత దీనిపై మాట మార్చిన ఆయన రైతుల నుంచి ఎక్కడ కూడా కమిమీషన్‌ వసూలు చేయరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటిదాకా వసూలు చేసిన కమీషన్‌కు సంబంధించిన రసీదులు తమకు సమర్పిస్తే సంబంధిత మండిల నుంచి తిరిగి వసూలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో ఏ మార్కెట్‌ లోనైనా కమీషన్‌ వసూలు చేస్తే రైతులకు తిరిగి ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డికి రైతులు మార్కెట్లో అమలు చేయాల్సిన డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల చెందిన టమాట రైతులు పాల్గొన్నారు.

ములకలచెరువులో భారీ ర్యాలీ

మార్కెట్‌లో వ్యాపారుల దోపిడీ అరికట్టాలి

అధికారులు రైతాంగం పక్షాన నిలవాలి

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి

రైతు సంఘం నాయకులు డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement