అధైర్య పడకండి.. భవిష్యత్తు మనదే | - | Sakshi
Sakshi News home page

అధైర్య పడకండి.. భవిష్యత్తు మనదే

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

పుంగనూరు : కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని, అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎవరూ అధైర్యపడకండి.. భవిష్యత్తు మనదేనని రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. మంగళవారం జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆయన పట్టణం, మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏటవాకిలి గ్రామంలో సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి, అక్కదేవతల ఆలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాంపల్లెలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తప్పుడు హామీలతో గెలవడం, అధికారంలోకి రాగానే హామీలు విస్మరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దెవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి హామీని నేరవేర్చారని స్పష్టం చేశారు. దళారీలకు, అక్రమాలకు చోటు లేకుండా సుమారు 2.37 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేయడం జరిగిందన్నారు. ఎంతో పారదర్శకమైన పరిపాలన సాగించి, క్యాలెండర్‌ను విడుదల చేసి, పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు చేసి, చరిత్ర సృష్టించిన ఏకై క వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమైందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టిన వైఎస్సార్‌సీపీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జింకా వెంకటాచలపతి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఫకృద్దీన్‌ షరీఫ్‌, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, జిల్లా బిసి సెల్‌ కార్యదర్శి వెంకట్రమణ, మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి జయరామిరెడ్డి, నాయకులు నాగేంద్ర, బాబు, రామమోహన్‌రెడ్డి, రాజారెడ్డి, శంకరప్ప, రెడ్డెప్ప, నంజుండప్ప పాల్గొన్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement