ములకలచెరువు : దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఒక బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ ఉచ్చోళ్లపల్లెకు చెందిన నందిని(15) ఊరి పక్కలో ఉన్న తిమ్మసంద్రం చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అక్కడ దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఎంతసేపటికీ నందిని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చెరువు వద్దకు చేరుకొని గాలించారు. చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక బి.కొత్తకోట కస్తూరిభా పాఠశాలలో 9వ తరగతి చదువుతుండేది. సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉండేది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండో పెళ్లి చేయలేదని ఆత్మహత్య
పుంగనూరు : తొలి భార్య మరణించడంతో రెండో పెళ్లి చేయాలని కోరినా.. తల్లిదండ్రులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బోడేవారిపల్లెలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మనోహర్‌కు గతంలో వివాహమైంది. భార్య మృతి చెందింది. ఒంటరిగా ఉన్న మనోహర్ తనకు రెండవ పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో ఇంట్లో పురుగుల నివారణ మందు తాగాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
దారి వివాదం.. రైతుపై దాడి
మదనపల్లె టౌన్: దారి వివాదం తలెత్తి రైతుపై ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన మంగళవారం పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం దేవల చెరువు పంచాయతీ మామిడి గుంపుల పల్లెకు చెందిన శేషాద్రిరెడ్డి(50)కి అదే ఊరికి చెందిన నారాయణరెడ్డి వర్గానికి దారి విషయమై గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం శేషాద్రిరెడ్డి తన పొలం వద్దకు వెళుతుండగా తమ భూమిలో ఉన్న దారి గుండా వెళ్లరాదని నారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో నారాయణరెడ్డి వర్గీయులు శేషాద్రిరెడ్డి పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని చికిత్స కోసం కుటుంబీకులు మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోడి పందెం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్
రాయచోటి : రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న కోడిపందెం (కాక్ ఫైట్) స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన దాడిలో ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నాలుగు బైకులు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక కోడి, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలియజేశారు.


